మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని అల్వాల ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన ధాన్యం గోల్‌మాల్‌పై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం డీపీఎం విద్యాసాగర్ అల్వాల గ్రామ పంచాయతీ వద్ద విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఐకేపీ క్షేత్రస్థాయి సిబ్బంది నకిలీ ట్రాక్ షీట్లు సృష్టించి 109 క్వింటాళ్ల ధాన్యం సొమ్మును కాజేయడానికి ప్రయత్నించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారని రైతులు మండిపడ్డారు. కాగా ఈ విషయంపై రైతులు, గ్రామస్తులు కలిసి జిల్లా పీడీ జగదేవ్ ఆర్యకు ఫోన్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేశారు. జరిగిన విషయంపై పీడీ స్పందించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీపీఎం విద్యాసాగర్‌కు రైతులు వినతి పత్రాన్ని అందించారు.


