● ఎమ్మెల్యే హరీశ్‌రావు ● కాంగ్రెస్ పాలనలో ‘రియల్’ రివర్స్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ పాలనలో తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం రివర్స్ అయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇది సిద్దిపేటకు మాత్రమే కాదని, రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉందన్నారు. దీంతో వ్యాపారులు రోడ్డున పడుతున్నారన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరూ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దన్నారు. పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని, కొన్ని ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయని తెలిపారు. సిద్దిపేటకు రేవంత్‌రెడ్డి అనే గ్రహణం పట్టిందని.. ఇంకో రెండేళ్లు ఆ గ్రహణం ఉంటుందన్నారు. ఆ తర్వాత మంచి రోజులు వస్తాయన్నారు. ఒకప్పుడు బంగారం కంటే సిద్దిపేటలో ప్లాట్ విలువ ఎక్కువగా ఉండేదన్నారు. ప్రస్తుతం భూములు కొనుగోలు చేయాలన్న, విక్రయించాలన్న ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని, మీ కళ్ల ముందే సినిమా రీల్‌లా అభివృద్ధి పరుగులు తీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని కాపాడాలి
ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించే అలవాటు చేసుకోవాలని సూచించారు. శనివారం ఫ్రెండ్స్ టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు పాల్గొని, అసోసియేషన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సాధారణంగా మెకానిక్‌లలో చదువుకున్నవారు తక్కు వ, ఐక్యత కూడా తక్కువగా ఉంటుందని కానీ మన సిద్దిపేట మాత్రం మీ ఐక్యత రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 20 ఏళ్ల ప్రయా ణం తర్వాత నూతన భవనం ఫంక్షన్ హల్‌లో అడుగు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ప్రతీరోజు మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు వేగంగా నడిస్తే, 60–70 ఏళ్ల వరకు డాక్టర్ అవసరం రాకుండా ఆరోగ్యంగా జీవించవచ్చని సూచించారు. అంతకుముందు అసోసియేషన్ సభ్యులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.


