ప్రమాదపుటంచున ఏదుల్లచెరువు కట్ట మిషన్‌భగీరథ ఎయిర్‌వాల్ విప్పడంతో.. నీటి ఒత్తిడికి కొట్టుకుపోయిన కట్ట దుంపలపల్లి–సిద్దిపేట ప్రధానరహదారిపై పొంచివున్న ముప్పు
దుబ్బాక: పట్టణంలోని మిషన్ భగీరథ సిబ్బంది పైప్‌లైన్ గేట్ వాల్ ఎయిర్ తీయడంతో నీటి ఒత్తిడికి ఏదుల్లచెరువు కట్ట కొట్టుకుపోయి పెద్ద కయ్యపడింది. సుమారుగా పదిగజాలకు పైగా కట్ట మట్టి కొట్టుకు పోయింది. దీంతో కట్టపై నుంచి ఉన్న దుబ్బాక–దుంపలపల్లి–సిద్దిపేట ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. చెరువుకట్ట చాలావరకు పెద్దకయ్య పడి రోడ్డు అంచువరకు రావడంతో ఏదైనా భారీ వాహనం వెళ్లినా, లేక వర్షానికి తడిసినా రోడ్డు దిగబడిపోయే ప్రమాదముంది. వాహనాలు ఏమాత్రం అదుపు తప్పినా ప్రమాదానికి గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.
రైతుల పొలాల్లో మట్టి, కంకర కుప్పలు
నీటి ఒత్తిడికి కట్ట కొట్టుకుపోయి రైతు గన్నె శ్రీనివాస్‌రెడ్డికి చెందిన పొలంలో పెద్ద ఎత్తున మట్టి, కంకర కుప్పలు పెట్టడటంతో రైతుకు నష్టం ఏర్పడింది.
వెంటనే చర్యలు చేపట్టాలి..
ప్రమాదం జరగకముందే అధికారులు మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు. సంబంధిత అధికారులు ఇంతవరకు స్పందించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
మిషన్ భగీరథ పైప్‌లైన్ నిర్వహణలో భాగంగా ఎయిర్‌వాల్ విప్పడంతో ఘటన జరిగింది. కట్ట వద్ద ప్రమాదం జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటాం.
– విశ్వేశ్, మిషన్ భగీరథ ఏఈ


