యూరియాపై సమస్యలు తలెత్తవద్దు
ఐదు గంటలు.. 26 శాఖలు
సాక్షి, సిద్దిపేట: జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం వాడీవేడిగా సాగింది. ఐదు గంటల మేర 26 శాఖల అభివృద్ధిపై సమీక్షించారు. కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి మంత్రి వివేక్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, దేశపతి శ్రీనివాస్, అంజిరెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ హైమావతితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. పలు సమస్యలపై హరీశ్‌రావు, రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు ప్రశ్నల వర్షం కురపించారు. వీటిని పలువురు అధికారులు సమాధానం చెప్పారు. మరి కొందరు నెల రోజుల క్రితం.. 20 రోజుల క్రితం.. అంటూ బదిలీపై వచ్చిన అధికారులు సమాధానం ఇచ్చారు.
గంట ఆలస్యంగా..
మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం మధ్యాహ్నం 2:15గంటలకు ప్రారంభమైంది. రాత్రి 7:25గంటల వరకు సమావేశం సాగింది. వ్యవసాయ శాఖ, ఉద్యాన, సివిల్ సప్లయ్ కార్పొరేషన్, పంచాయతీ రాజ్ ఇంజనీర్, ఆర్ అండ్ బీ, విద్యా, ఇంటర్మీడియెట్, వైద్య ఆరోగ్య, బీసీ, ఎస్సీ, గిరిజన సంక్షేమ, హౌసింగ్, పశు సంవర్థక, మత్స్య, మైనింగ్, ట్రాన్స్‌కో, కార్మిక, ఉపాధి, ఫైర్, దేవాదాయ, రెడ్కో, లీడ్, ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూఎస్‌లలో జరుగుతున్న అభివృద్ధి, సమస్యల పై చర్చించారు. జిల్లాలో జరిగిన యూరియా అక్రమ రవాణాపై చర్చ సాగింది.
సమీక్షకు హాజరైన జిల్లా అధికారులు
జిల్లా అభివృద్ధిపై సమీక్ష
యూరియా ఇబ్బందులు రావొద్దు: మంత్రి వివేక్
పలు సమస్యలపై నిలదీసిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు
జిల్లాలో రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సన్నబియ్యం సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డబుల్ బెడ్ రూంలకు లబ్ధిదారులను ఎంపిక చేసి అందించాలన్నారు.


