● అల్వాలలో 109 క్వింటాళ్ల ధాన్యం మాయం
● గ్రామ పంచాయతీ వద్ద రైతుల ఆందోళన
● ఐకేపీ సీఏల చేతివాటం అంటూ ఆరోపణ
మిరుదొడ్డి(దుబ్బాక): అధికారుల కనుసన్నల్లో ఐకేపీ సీఏలు ధాన్యం కొనుగోళ్లలో రైతులను మోసం చేసి 109 క్వింటాళ్ల ధాన్యాన్ని మాయం చేశారని ఆరోపిస్తూ శుక్రవారం మండల పరిధిలోని అల్వాల రైతులు ఆందోళనకు దిగారు. ఇటీవల గ్రామంలోని గోదాం వద్ద వడ్ల కొనుగోలు కేంద్రంలో పొల్లు పేరిట, వర్షానికి తడిసి మొలకెత్తడంతో పాటు రంగు మారిందన్న సాకుతో రైతులను భయభ్రాంతులకు గురి చేసి అధిక తూకం వేశారని రైతులు ఆరోపించారు. అలా అధిక తూకం వేసి సేకరించిన 254 ధాన్యం సంచులకు గానూ 109 క్వింటాళ్ల 20 కిలోల ధాన్యాన్ని ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు కౌలు రైతుల పేరును నమోదు చేయించారని మండిపడ్డారు. అనంతరం చెప్యాల క్రాస్ రోడ్డులోని చందన రైస్ మిల్లుల్లో ధాన్యాన్ని వేయింగ్ బిల్లు వేయించారని మండిపడ్డారు. రూ.2.58 లక్షల విలువైన ధాన్యానికి సంబంధం లేని కౌలు రైతుల పేరిట బిల్లులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అమాకులైన రైతులను ఆసరాగా చేసుకుని అధిక తూకం వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల సమక్షంలో రైతులు తీర్మానించారు. అధికారుల నిర్లక్ష్యం, ఐకేపీ సీఏల చేతి వాటం వల్ల అల్వాల కోనుగోలు కేంద్రంలో జరిగిన గోల్‌మాల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. కాగా ఐకేపీ సీఏలపై వచ్చిన ఆరోపణలపై ఏపీఎం లక్ష్మీనర్సమ్మను వివరణ కోరగా రైతుల ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామ తెలిపారు.


