జిల్లా పరిషత్, మండల పరిషత్, సిద్దిపేట మున్సిపాలిటీలలో పాలక వర్గాలు లేకపోవడంతో సమావేశాలు జరగడం లేదని, దీంతో ప్రజా సమస్యలు చెప్పేందుకు వేదిక లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లా అభివృద్ధిపై రివ్యూ సమావేశం ప్రతి మూడు నెలలకు ఒక సారి నిర్వహించాలని కోరారు. గత సమావేశంలో చర్చించిన మినెట్స్ ఇవ్వడం లేదని, ఏజెండాను సమావేశానికి రెండు రోజుల ముందు ఇవ్వకుండా సమావేశంలో ఇస్తే ఎలా చర్చిస్తామని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చాక్ పీస్‌లకు డబ్బులు లేవని, సంక్షేమ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు నోట్ బుక్‌లను ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు డ్రిప్ లేకపోవడంతో ముందుకు రావడం లేదని ఆరోపించారు. వ్యవసాయానికి ప్రభుత్వం 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పుతున్నారని, క్షేత్ర స్థాయిలో 11 గంటలు కూడా రావడం లేదని ఆరోపించారు. యూరియా సరఫరాలో రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలని కోరారు.


