● జిల్లాలో 38,973 మెట్రిక్ టన్నులు సేకరణ ● రూ.10.53 కోట్లు పెండింగ్ ● వానాకాలం సాగుకు అందకపోవడంతో రైతన్న పరేషాన్ ● అప్పులు చేసి యూరియా, విత్తనాలు కొనుగోలు
జిల్లాలో 31వేల ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేశారు. వ్యవసాయ మార్కెట్‌లలో పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 9,032 మంది రైతుల నుంచి 38,973 మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేశారు. వీటికి రూ.93.53 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.83 కోట్లను మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.10.53కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వెయ్యి మందికి పైగా రైతులకు డబ్బులు చెల్లించకపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉండే సొసైటీ అధికారులను అడిగితే తమకు సంబంధం లేదని, మార్క్‌ఫెడ్ అధికారులను అడగాలని వారు సమాధానమిస్తున్నారు. మార్క్‌ఫెడ్ అధికారులకు ఫోన్ చేస్తే స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు.
45 రోజులుగా పెండింగ్
మక్కలు విక్రయించి 45 రోజులైనా ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదు. కొనుగోళ్లు పూర్తయినా చెల్లింపులు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వానాకాలం సాగు పనులు ముమ్మరమయ్యాయి. మక్కల డబ్బులు వస్తే పంట పెట్టుబడికి అందుతాయని ఆశగా రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం చెల్లించకపోవడంతో అప్పులు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. గిట్టుబాటు ధర కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి పరిస్థితి. పండించిన పంటను అమ్మేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. విక్రయించిన తర్వాత డబ్బుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి మక్కల డబ్బులు త్వరగా చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
పంటలు పండించిన రైతులు ధాన్యం అమ్మేందుకు పడిగాపులు, ఇబ్బందులు పడ్డారు. విక్రయించిన తర్వాత డబ్బుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మక్కల కొనుగోళ్లు పూర్తయి 20 రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం డబ్బులు చెల్లించడం లేదు. వానాకాలం సాగు పెట్టుబడికి ఉపయోగపడతాయని అనుకున్న రైతులకు తిప్పలు తప్పడం లేదు. దీంతో అప్పులు చేసి యూరియా, విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్‌ను కాదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే అసలుకే మోసం వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
– సాక్షి, సిద్దిపేట
నెల రోజులైనా డబ్బులు రాలే
చేర్యాల వ్యవసాయ మార్కెట్‌లో మే 29న 26.5 క్వింటాళ్ల మొక్కజొన్నలు విక్రయించాను. నెల రోజులు దాటినా డబ్బులు రాలేదు. సాగు పెట్టుబడికి డబ్బులు ఉపయోగపడుతాయి అనుకున్నా. డబ్బులు రాకపోవడంతో అప్పు తెచ్చాను. ఇబ్బంది అవుతుంది. అధికారులు స్పందించి డబ్బులు త్వరగా ఇప్పించాలి.
–దాసరి అనిల్ కుమార్, చేర్యాల
త్వరలోనే జమవుతాయి
మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మక్కలను కొనుగోలు చేశాం. కొనుగోలు చేసిన మక్కల వివరాలను హెడ్ ఆఫీస్‌కు పంపించాం. రైతుల వారీగా డబ్బులు జమ అవుతున్నాయి. త్వరలో పూర్తి స్థాయిలో చెల్లింపులు కానున్నాయి.
– బాలకృష్ణ, డీఎం, మార్క్‌ఫెడ్


