● ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ● జిల్లాలో 13 సంఘాలకు ఎన్నికలు
దుబ్బాక: చేనేత సహకార సంఘాల్లో ఎన్నికల సందడి మొదలైంది.13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమపార్టీల అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవాలనే పట్టుదలతో సమీకరణల్లో మునిగితేలుతున్నారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికలపై దృష్టి సారించి పావులు కదుపుతుండటం విశేషం.
4వ తేదీ నామినేషన్లకు చివరి రోజు
జిల్లాలో మొత్తం 18 చేనేత, ఉన్ని సంఘాలు ఉన్నాయి. మొదటి విడతలో 13 సొసైటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. 4వ తేదీ చివరి రోజు కావడంతో పోటీ చేసేందకు ఆసక్తిగా ఉన్న అభ్యర్థులతో ఆయా సంఘాల్లో ఎన్నికల సందడి నెలకొంది. దుబ్బాక, సిద్దిపేట, ఇర్కోడ్, సిద్దిపేట ప్రాజెక్టు, గజ్వేల్, దుద్దెడ చేనేత సంఘాలతో పాటు లింగారెడ్డిపల్లి, శ్రీరాములపల్లి, ధర్మారం, గజ్వేల్ ఉన్ని సంఘాలకు పోలింగ్ జరుగుతుంది. 50 మంది ఓటర్ల కన్నా తక్కువగా ఉన్న సిద్దిపేట ఆదర్శ, పొట్లపల్లి, చెర్ల తోటపల్లి, గజ్వేల్ ఉన్ని సంఘాలకు చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
10న పోలింగ్
చేనేత సంఘాలకు 10న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ప్రక్రియకు ఈ నెల 4 వరకు అవకాశం ఉండగా 5న స్క్రూటినీ, 6న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.10న పోలింగ్ అనంతరం అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడిస్తారు. తర్వాత మూడు రోజుల్లోగా సొసైటీ చైర్మన్, పాలక వర్గాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. మొదటి విడతలో జరుగనున్న 13 సంఘాల్లో మొత్తం 2,510 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.జిల్లాలో అత్యధికంగా దుబ్బాక చేనేత సహకార సంఘంలో 1,502 ఓటర్లు ఉండటంతో ఈ సంఘం ఎన్నికలు చాలా ఆసక్తిగా తయారయ్యాయి.
పకడ్బందీగా ఎన్నికలు
చేనేత సహకార సంఘాల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. నామినేషన్లు ప్రారంభమయ్యాయి. 4వ తేదీ వరకు నామినేషన్లు తీసుకుంటాం.10న పోలింగ్ అదే రోజు కౌంటింగ్. దుబ్బాక చేనేత సహకార సంఘంలో అత్యధికంగా ఓటర్లు ఉన్నారు.
–శ్రీనివాస్‌రెడ్డి,ఎన్నికల అధికారి


