యూరియా పక్కదారిపై కొరడా చేర్యాల ఉదంతంపై సమగ్ర దర్యాప్తు రెండు ఫర్టిలైజర్స్ దుకాణాల అనుమతి రద్దు అక్రమార్కులపై కఠిన చర్యలు: కలెక్టర్
సిద్దిపేటజోన్: యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలేది లేదని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హైమావతి స్పష్టం చేశారు. గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చేర్యాల పరిధిలోని శ్రీసాయి శివ ఫర్టిలైజర్స్ దుకాణంలో యూరియా సరఫరా విషయంలో అక్రమాలు జరిగినట్లు దృష్టికి వచ్చిందన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ద్వారా విచారణలో.. షాప్ యజమాని సందీప్‌రెడ్డి ఈ పాస్ మిషన్ ద్వారా 6,429 యూరియా బస్తాలను నిబంధనలకు విరుద్ధంగా రైతుల పేరిట విక్రయించినట్లు తేలిందన్నారు. అతనిపై పోలీస్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. అదేవిధంగా షాప్ లైసెన్స్ రద్దు చేసినట్లు తెలిపారు. దీనితో సంబంధం ఉన్న సిద్దిపేట పరిధిలోని ఆంజనేయ ఫర్టిలైజర్స్, గణేశ్ ట్రేడర్స్ షాప్‌ల లైసెన్సులను వ్యవసాయ శాఖ రద్దు చేసిందన్నారు. యూరియా పక్కదారి పడుతున్నా పర్యవేక్షణ చేయకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై చేర్యాల మండల వ్యవసాయ శాఖ అధికారి భోగేశ్వర్ స్వామిని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి, ప్రమేయం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యాప్ తప్పనిసరి..
గత రబీ సీజన్ నుంచి ప్రభుత్వం యూరియా యాప్ అందుబాటులోకి తెచ్చిందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నట్టు కలెక్టర్ అన్నారు. రబీ సీజన్ పంట కాలం పూర్తి కావడంతో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో యూరియా యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం క్లోజ్ చేసి యూరియా అమ్మకాలు నిలిపివేసిందన్నారు. ఇదే సమయంలో చేర్యాలకు చెందిన శ్రీసాయి శివ ఫర్టిలైజర్స్ కేంద్ర ప్రభుత్వ ఈపాస్ మిషన్ ఉపయోగించి రైతుల పేర్లను అక్రమంగా నమోదు చేసి అక్రమాలకు పాల్పడినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా యాప్‌ను ఉపయోగించడం వల్ల ఎలాంటి అక్రమాలకు ఆస్కారం ఉండదన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్గొన్నారు.


