ఇప్పటివరకు 5,125 మందే ప్రవేశం లక్ష్యం చేరని ‘బడిబాట’ ఆగస్టునాటికై నా విద్యార్థుల సంఖ్య పెరిగేనా?
ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన అడ్మిషన్లు
ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, నాణ్యమైన విద్య అందిస్తున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరగడంలేదు. గతేడాదితో పోలిస్తే తక్కువగా మంది విద్యార్థులు చేరారు. బడుల్లో డిజిటల్ ద్వారా విద్యా బోధన, మధ్యాహ్నం భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్‌లు అందజేస్తున్నప్పటికీ తల్లిదండ్రులు మక్కువ చూపడం లేదు. కార్పొరేట్ విద్యా సంస్థలు రూ.లక్షల్లో ఫీజులు దండుకుంటున్నా అటువైపే మొగ్గుచూపుతుండటం గమనార్హం.
– సాక్షి, సిద్దిపేట
జిల్లా వ్యాప్తంగా 901 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ప్రాథమిక 567, ప్రాథమికోన్నత 113, ఉన్నత 201 పాఠశాలలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపే లక్ష్యంగా చేపట్టిన బడిబాట కార్యక్రమం లక్ష్యానికి చేరువ కాలేకపోయింది. ఈ సంవత్సరం జూన్ 2 నుంచి జూన్ 20వ తేదీ వరకు బడి బాట చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి సర్కారు బడుల్లో చేరాలని విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వ ఉపాధ్యాయులు కోరారు. పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులపై వివరించారు. అయినా ఆశించిన స్థాయిలో ప్రవేశాలు రాబట్టలేకపోయారు.
ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు 5,125 మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు పొందారు. అందులో 1,215 మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పొందారు. మిగతా వారు 3,910 మంది 1వ తరగతిలో చేరారు. గతేడాది 7,949 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరగా అందులో ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరిన వారిలో 2,456 మంది ఉన్నారు. గతంతో పోలిస్తే 2,824 మంది విద్యార్థులు తగ్గారు.
సమన్వయం, ప్రచారం లేకే..
బడిబాట కార్యక్రమం జరిగినప్పుడు అధిక ఉష్ణోగ్రతల నేపథ్యం ప్రవేశాలకు ఆటంకం కలిగింది. పలు చోట్ల ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీ సిబ్బంది, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం లేక సమస్య నెలకొంది. బడిబాట కార్యక్రమం నిర్వహణ పై క్షేత్రస్థాయిలో తగిన ప్రచారం లేక మందకొడిగా ప్రవేశాలు నమోదయ్యాయి. పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు వరకు జరగనుంది. అప్పటి వరకై నా ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల పెరిగేనా అని జిల్లా విద్యాశాఖ అధికారులు చర్చించుకుంటున్నారు.
ఇంకా సమయం ఉంది
అడ్మిషన్లకు ఇంకా సమయం ఉంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ప్రవేశం పొందగానే యూడైస్‌లో నమోదు చేయడం లేదు. ఇటీవల హెచ్‌ఎంలకు సమావేశం నిర్వహించి నమోదు చేయాలని ఆదేశించాను. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం, నాణ్యమైన విద్యను అందిస్తున్నాం.
– వరగంటి శాసీ్త్ర, జిల్లా విద్యా శాఖ అధికారి


