● నాలుగు నెలలైనా పూర్తికాని బ్రిడ్జి ● జాడలేని కాంట్రాక్టర్ ● పల్లెలకు రాకపోకలు బంద్ ● శేరిపల్లి–గుంటిపల్లి గ్రామస్తుల ఇక్కట్లు
వర్గల్(గజ్వేల్): ‘బ్రిడ్జి’ నిర్మాణం పేరుతో రోడ్డును అడ్డంగా తవ్వేశారు. వానాకాలంలోగా పూర్తిచేస్తామని నమ్మబలికారు. రూ.2.2 కోట్ల నిధులు అంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు. గొయ్యితోనే పనులు నిలిపేశారు. నాలుగు నెలలైనా అతీగతి లేకపోవడంతో శేరిపల్లి–గుంటిపల్లి మధ్య వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. వర్గల్ మండలం శేరిపల్లి–గుంటిపల్లి రోడ్డుపై శేరిపల్లి శివారులో హైలెవెల్ వంతెన నిర్మాణానికి 2023లో పీఎంజీఎస్‌వై ద్వారా ప్రభుత్వం రూ.2.2 కోట్లు మంజూరుచేసింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ టెండర్ నిర్వహించి, 2025లో అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తిచేసి కంట్రాక్టర్‌కు పనులు అప్పగించింది.
గొయ్యికే పరిమితం
శేరిపల్లి శివారులో హైవే బ్రిడ్జి నిర్మాణ పనులు నాలుగు నెలల క్రితం మొదలయ్యాయి. రోడ్డు మీద పాత కాజ్‌వేను తొలగించి అట్టడుగుదాకా భారీ గొయ్యి తవ్వారు. పక్కనుంచి జనం రాకపోకల కోసం మొక్కుబడిగా మట్టి దారితో మమ అనిపించారు. నాలుగు రోజులు సర్దుకుపోదామని భావించిన ఇరుగ్రామాల ప్రజలకు ‘షాకిస్తూ’ కాంట్రాక్టర్ నడిరోడ్డులో భారీగొయ్యి తవ్వి, అంతటితోనే పనులు ఆపేశారు.
శేరిపల్లి, గుంటిపల్లె పక్కపక్కనే ఉంటాయి. పొలాలు కలిసిపోయినట్లే ఉంటాయి. ఎద్దు ఎవుసం నమ్ముకొని మేము కూరోగాయో వేసుకుంటం. మార్కెట్‌కు తీసుకపోతాం. సౌకర్యంగా ఉన్న రోడ్డును తవ్విపారేసిండ్రు. వానాకాలం రాక ముందే పూర్తయితదని, జాడలేకుండా పోయిండ్రు. బురద తోవే మాకు దికై ్కంది. మా గోస సర్కారు పట్టించుకోవాలె.
రోడ్డును నాశనం చేసిండ్రు: శేరిపల్లి రైతులు
నోటీసు జారీచేశాం
బ్రిడ్జి పనులు నిలిచి రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నది వాస్తవం. పనులు వేగవంతం చేయాలని అనేకసార్లు కాంట్రాక్టర్ కు చెప్పాం. ప్రజల ఇబ్బందులు వివరించాం. అగ్రిమెంట్‌కు అనుగుణంగా పనులు జరగా ల్సిందే. కాంట్రాక్టర్‌కు నోటీసు జారీచేశాం. స్పందించకుంటే తదుపరి చర్యలు చేపడతాం. – సోహెల్ (పీఆర్ ఏఈ)


