పాలిటెక్నిక్‌లో రేపు స్పాట్‌ అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌లో రేపు స్పాట్‌ అడ్మిషన్లు

Jul 2 2026 6:55 AM | Updated on Jul 2 2026 6:55 AM

గజ్వేల్‌: స్థానిక ప్రభుత్వ ఆదర్శ గురుకుల పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మిగిలిన సీట్ల భర్తీ కోసం శుక్రవారం ఉదయం 10గంటలకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీహెచ్‌వీ కృష్ణారావు తెలిపారు. పాలిసెట్‌లో అర్హత సాధించిన, సాధించని అభ్యర్థులు స్పాట్‌ అడ్మిషన్లకు హాజరై ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. అభ్యర్థులు తమ వెంట టీసీ, పదోతరగతి మెమో, స్టడీ సర్టిఫికెట్లు, కులధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు, పాలిసెట్‌ రాసిన వారు ర్యాంకు కార్డు తెచ్చుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నాణ్యమైన విద్యప్రభుత్వ కళాశాలల్లోనే..

డీఐఈఓ రవీందర్‌రెడ్డి

చిన్నకోడూరు(సిద్దిపేట): నాణ్యమైన విద్య కేవలం ప్రభుత్వ కళాశాలల్లోనే లభిస్తుందని జిల్లా ఇంటర్మీడియెట్‌ అధికారి రవీందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం చిన్నకోడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను డీఐఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని ప్రతి తరగతి గదిని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడుతూ సమస్య లు తెలుసుకొన్నారు. కళాశాలలో అన్ని రకాల వసతులు ఉన్నాయని, డిజిటల్‌ తరగతులు జరుగుతాయన్నారు. ప్రతీ విద్యార్థి మంచి మార్కులతో ఇంటర్‌ పూర్తి చేయాలని సూచించారు. ప్రిన్సిపాల్‌, ఆధ్యాపక బృందంతో ఏర్పాటు చేసిన సమావేశంలో గతేడాది కంటే ఈఏడాది అడ్మిషన్ల సంఖ్య పెంచాలన్నారు. రెండేళ్లుగా చిన్న కోడూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఇంటర్‌ ఫలితాల్లో జిల్లాలో ప్రథమ స్థానంలో ఉన్నందున ప్రిన్సిపాల్‌, అధ్యాపకులను డీఐఈఓ అభినందించారు.

అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శేషం

గజ్వేల్‌రూరల్‌: డీడీఎన్‌ (ధూపదీప నైవేద్య) అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శేషం శ్రీనివాసాచార్యులకు మరోసారి అవకాశం లభించింది. హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌ భవనంలో అర్చకుల నూతన రాష్ట్ర సంఘ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గజ్వేల్‌లోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉన్న శేషంను రెండోసారి డీడీఎన్‌ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

విత్తన అమ్మకాలు నిలిపివేత

చేర్యాల(సిద్దిపేట): పట్టణ పరిధిలోని ఎరువుల దుకాణాల్లో నిబంధనలు ఉల్లంఘించడంతో విత్తన అమ్మకాలను అధికారులు నిలిపివేశారు. స్థానిక బాలాజీ సీడ్స్‌ ఫర్టిలైజర్‌ అండ్‌ పెస్టిసైడ్స్‌, జ్యోతి ఫర్టిలైజర్స్‌లో వారం రోజుల పాటు విత్తనాల అమ్మకాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి ఎండీ.ఆప్రోజ్‌ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రెండు దుకాణాల నిర్వాహకులు విత్తన అమ్మకాల నిబంధనలు ఉల్లంఘించినందున వారం పాటు పత్తి, మొక్కజొన్న విత్తనాలు అమ్మకుండా నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

మెమోలు జారీ

కొండపాక(గజ్వేల్‌): మండలంలోని మర్పడ్గ హైస్కూల్‌ హెచ్‌ఎం భైరయ్య, ఉపాధ్యాయురాలిపై శాఖాపరమైన చర్యలకు అధికారులు మెమోలు జారీ చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఈఎల్స్‌ (సంపాదిత సెలవులు) పేరిట ప్రభుత్వ సొమ్మును కాజేయడానికి సహకరించిన హెచ్‌ఎంపై, సొమ్ము కాజేసిన ఉపాధ్యాయురాలిపై సాక్షి దినపత్రికలో ఈనెల 29న ‘సారు.. ఇదేం తీరు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. అదే రోజు ఆర్జేడి కార్యాలయం నుంచి అందిన ఆదేశాల మేరకు హెచ్‌ఎంకు మెమో జారీ చేశారు. ఉపాధ్యాయురాలికి మాత్రం బుధవారం అందజేశారు. ఈఎల్స్‌ పేరిట అక్రమంగా డబ్బులు కాజేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న విషయమై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై డీఈఓ శాస్త్రిని వివరణ కోరగా ఉపాధ్యాయురాలిపై శాఖాపరమైన క్రమ శిక్షణ చర్యల నిమిత్తం ఆర్టికల్‌ ఆఫ్‌ చార్జి ఫ్రేమ్‌ అందజేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement