రాకపోకలకు తీవ్ర అడ్డంకి..
పరిష్కారానికి చర్యలు
గజ్వేల్ బస్టాండ్ వద్ద బస్సుల ఇన్, అవుట్‌కు ఇబ్బందులు ఏర్పడుతున్న మాట వాస్తవమే. ముందుభాగంలో డివైడర్‌ను కొంత కట్ చేస్తే...రాకపోకలకు ఇబ్బంది ఉండదు. ఈ దిశగా అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాం. ఇకపోతే రింగు రోడ్డు అందుబాటులోకి వస్తే భారీ వాహనాలు పట్టణంలోకి రాకుండా ఉంటాయి.
– పావన్, ఆర్‌టీసీ డీఎం, గజ్వేల్–ప్రజ్ఞాపూర్
కటింగ్ చేయాల్సిన డివైడర్ ఇదే
గజ్వేల్: లోపాలు సరిచేయకుండానే గజ్వేల్ పట్టణంలోని నూతన బస్టాండ్‌ను ఆర్భాటంగా వినియోగంలోకి తేవడం ట్రాఫిక్ సమస్యలకు సృష్టిస్తోంది. ప్రయాణికులకు అవస్థలను కలిగిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ముందుభాగంలో ఉన్న డివైడర్‌ను కట్ చేస్తేనే రాకపోకలకు ఇబ్బందులు తొలగి, ట్రాఫిక్ సమస్యలు కొంత మేర పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలి.
రూ.2.86కోట్లతో బస్టాండ్ నిర్మాణం
ఎస్‌డీఎఫ్(స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్) ద్వారా పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పక్కన రూ.2.86 కోట్లతో బస్టాండ్ పనులు పూర్తయ్యాయి. గత నెల 31న మంత్రి వివేక్ చేతుల మీదుగా ఆర్భాటంగా ప్రారంభించారు. కేవలం పదిహేను గుంటలలోపు స్థలంలో నిర్మించిన ఈ బస్టాండ్‌లో బస్సులు నిలిపే అవకామే లేదు. ఒకవేళ బస్సులు నిలిపితే తర్వాత వచ్చే బస్సులతో, వేలాదిమంది ప్రయాణికులతో మరింతగా కిక్కిరిసిపోతున్నది. అంతేకాకుండా ఇన్, అవుట్ బస్సులు వెళ్లడానికి తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తనున్నాయి. రాష్ట్రంలోనే కీలక నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌లో ఈ పరిస్థితి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
డివైడర్ కట్ చేస్తేనే సమస్యకు పరిష్కారం
ప్రస్తుతం బస్టాండ్ వద్ద బస్సుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే.. ముందు భాగంలోని డివైడర్‌ను కొంత భాగం కట్ చేయాల్సి ఉన్నది. అలా చేస్తేనే బస్టాండ్ ముందు భాగంలో బస్సులు ఫ్రీగా రాకపోకలు సాగించడానికి అవకా శం కలగనున్నది. ప్రస్తుతం ఈ రోడ్డు ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) పరిధిలో ని 161ఏఏ నెంబర్ రోడ్డు. జాతీయ రహదారిగా ఉండగా... దీనిపై డివైడర్ కట్ చేయాలంటే ఎన్‌హెచ్‌ఏఐ అనుమతి తప్పనిసరిగా పొందాలి. కానీ ఈ అనుమతి వ్యవహారం ఢిల్లీ వరకు వెళ్లాల్సి రావడం వల్ల సంబంధిత అధికారులు పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదని తెలుస్తున్నది. మరో ముఖ్యవిషయం ఏమిటంటే త్వరలోనే ఈ రహదారి స్టేట్ హైవేగా మార్చడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. అలా అయితే స్థానిక అధికారులు అనుమతి సరిపోతుందని చెబుతున్నారు.
రింగు రోడ్డు పూర్తిస్థాయిలో
అందుబాటులోకి వస్తే...
గజ్వేల్ రింగు రోడ్డు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం వల్ల భారీ వాహనాలు పట్టణంలోని రోడ్డు గుండా వెళ్తున్నాయి. ప్రత్యేకించి బస్టాండ్ ప్రాంతంలో నుంచి భారీ వాహనాలు వెళ్లినప్పు డు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతోంది. ఈ సందర్భంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రింగు రోడ్డు అనుసంధానం సంగాపూర్ రోడ్డువైపున 150మీటర్ల మేర ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్న విషయం తెల్సిందే.
లోపాలు సరిచేయకుండానేవినియోగంతో ట్రాఫిక్ ఇక్కట్లు
ప్రయాణికులకు తప్పని అవస్థలు
ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన
గజ్వేల్ నూతన బస్టాండ్ దుస్థితి


