● కలెక్టర్ హైమావతి ● పాఠశాలల ఆకస్మిక తనిఖీ
చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం చిన్నకోడూరులోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. బియ్యం, కూరగాయల నాణ్యతపై ఆరా తీశారు. విద్యార్థుల తో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆమె మాట్లా డుతూ శారీరకంగా దృఢంగా ఉంటేనే మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. అన్ని కూరగాయలు ఇష్టంగా తినాలని సూచించారు. చదువు విషయంలో రాజీ పడవద్దని, ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్ సలీమ్, హెచ్‌ఎం, టీచర్‌లు ఉన్నారు.
పీహెచ్‌సీ తనిఖీ..
చిన్నకోడూరు పీహెచ్‌సీని కలెక్టర్ తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు, ఓపీ రిజిస్టర్‌లను తనిఖీ చేశారు. అన్ని రకాల మందులు ఉన్నాయా అని తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆస్పత్రి ఆవరణలో చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.


