● జిల్లాలో 95,577 మందికి చుక్కల పంపిణీ ● డీఎంహెచ్‌ఓ ధనరాజ్
సిద్దిపేటకమాన్: జిల్లాలో మూడు రోజులుగా నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైందని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. జిల్లా కేంద్రం సిద్దిపేటలో మంగళవారం వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి నిర్వహించిన పోలియో చుక్కల పంపిణీని డీఎంహెచ్‌ఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి రోజు బూత్‌ల ద్వారా, తర్వాత రెండు రోజులు వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. గృహసందర్శన, ట్రాన్సిస్ట్ పాయింట్స్, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాలు, మొబైల్ టీంల ద్వారా 2,54,220 ఇళ్లను సందర్శించి 95,577 మంది చిన్నారులకు పోలియో చుక్కలు పంపిణీ చేశామన్నారు. ఇమ్యునైజేషన్ అధికారి దీప్తిప్రియాంక, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు పాల్గొన్నారు.


