చేనేత పోరు షురూ.. | - | Sakshi
Sakshi News home page

చేనేత పోరు షురూ..

Jun 30 2026 4:44 PM | Updated on Jun 30 2026 4:44 PM

సిద్దిపేటజోన్‌: జిల్లాలో చేనేత, ఉన్ని సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. సోమవారం జిల్లా అధికారులు ఆయా సొసైటీల వారీగా నోటిఫై చేశారు. సంబంధించిన షెడ్యూల్‌ సహకార సంఘాల వద్ద నోటీస్‌ బోర్డ్‌ మీద అతికించారు. జిల్లాలోని 17 సంఘాలకు గాను మొదటి దశలో 13 సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన వాటికి మరో నెల తరువాత నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 13 సొసైటీలకు చెందిన 2,510 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.13 సొసైటీల్లో సిద్దిపేట ఆదర్శ, పోట్లపల్లి, చెర్ల తోటపల్లి, గజ్వేల్‌ ఉన్ని సహకార సంఘాల ఎన్నికల్లో 50 లోపు ఓటర్లు ఉండగా, చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్‌ ప్రక్రియ జరగనుంది. జూలై 3న నామినేషన్ల స్వీకరణ, అదేరోజు స్కృటినీ, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరగనుంది. అనంతరం నాలుగు సొసైటీల్లో పోలింగ్‌, ఫలితాల ప్రకటన, తొమ్మిది మంది సభ్యులతో ఆఫీస్‌ బేరర్స్‌తో కూడిన కార్యవర్గాన్ని ప్రకటిస్తారు.

10న పోలింగ్‌..

మొదటి విడత చేనేత సహకార సంఘాల ఎన్నికల షెడ్యూల్‌ మేరకు 50 ఓటర్లకు పైగా ఉన్న తొమ్మిది సహకార సంఘాల ఎన్నికలు జూలై 10న జరుగనున్నాయి. సిద్దిపేట చేనేతసహకార సంఘం, ఇర్కోడ్‌, సిద్దిపేట ప్రాజెక్టు, దుద్దెడ, దుబ్బాక, లింగారెడ్డిపల్లి ఉన్ని సంఘం, శ్రీరాములపల్లి, ధర్మారం ఉన్ని సంఘము,, గజ్వేల్‌ ఉన్ని సంఘాల ఉన్నాయి. సోమవారం నోటిఫై జులై 2 నుంచి 4 వరకు నామినేషన్ల స్వీకరణ, జులై 5న స్కృటినీ, జులై 6న నామినేషన్ల ఉపసంహరణ, తుది జాబితా విడుదల, గుర్తుల కేటాయింపు, జులై 10న పోలింగ్‌ ప్ర క్రియ, అనంతరం అదేరోజు ఓట్ల లెక్కింపు, ఫలితాలను ప్రకటిస్తారు. మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది.

ఎన్నికల అధికారుల నియామకం..

జిల్లాలో జరుగుతున్న 13 చేనేత, ఉన్ని సహకార సంఘాల ఎన్నికల నిర్వహణలో భాగంగా అధికారులను నియమించారు. సిద్దిపేటకు అమృత సేనారెడ్డి, ఆదర్శ సొసైటీకి రేఖ, ఇర్కోడ్‌కు రాజమౌళి, సిద్దిపేట ప్రాజెక్టుకు వర్మ, గజ్వేల్‌కు గౌతమ్‌, పోట్లపల్లికి శ్రీకాంత్‌, చెర్ల తోట పల్లికి యాకుబ్‌, శ్రీరాములు పల్లికి యాదగిరి, దుబ్బాకకు శ్రీనివాస్‌ రెడ్డి, దుద్దేడకు సతీష్‌ రెడ్డి, లింగారెడ్డి పల్లి ఉన్ని సంఘముకు ప్రవీణ్‌ రెడ్డి, ధర్మారం ఉన్ని సంఘముకు రవి, గజ్వేల్‌కు నాగరాజులను ఎన్నికల అధికారులుగా నియమించారు.

మోగిన ఎన్నికల నగారా

ఏర్పాట్లు పూర్తి

ఎన్నికల షెడ్యూల్‌ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశాం. మొదటి దశలో 13 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. వాటికి సంబంధించిన ఎన్నికల అధికారులను నియమించాం. సజావుగా ఎన్నికల నిర్వహణకు పూర్తి చర్యలు తీసుకుంటాం.

–బిచ్చప్ప, జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement