● నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సరఫరా ● మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడరూరల్(హుస్నాబాద్): రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బస్వాపూర్ గ్రామ పెద్దమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఏరువాక పౌర్ణమి పురస్కరించుకుని రైతులతో కలిసి దుక్కి దున్ని విత్తనాలను చల్లారు. అలాగే మండల కేంద్రంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో పాల్గొని బీఎల్‌వోలకు పలు సూచనలు చేశారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యలయాన్ని మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మలజయరాజ్, సర్పంచ్‌లు తదితరులు పాల్గోన్నారు.
ఒక్క ఓటూ పోవద్దు: మంత్రి
హుస్నాబాద్‌రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేక ఓట్లను బీజేపీ తొలగించాలని చూస్తోందని, అర్హులందరూ బీఎల్వోలకు సహకరించి ఒక్క ఓటు పోకుండా జాగ్రత్త పడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం పోతారం(ఎస్)లో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించి ఓటరు జాబితా సవరణ గురించి గ్రామస్తులకు వివరించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 2.51 లక్షల ఓట్లు ఉంటే 61 వేల ఓట్లను తటస్థంగా పెట్టినట్లు చెప్పారు. అర్హలందరూ సరైన పత్రాలు, రెండు కలర్ ఫొటోలతో సిద్ధంగా ఉండి మీ ఇంటికి వచ్చే బీఎల్వోలకు అందించాలన్నారు. సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పూర్తి చేయించాలని చెప్పారు.


