సారు.. ఇదేం తీరు | - | Sakshi
Sakshi News home page

సారు.. ఇదేం తీరు

Jun 29 2026 7:15 AM | Updated on Jun 29 2026 7:15 AM

● తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి.. ● ఈఎల్స్‌ను పొందేందుకు అడ్డదారులు ● జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి..

ఉత్తమ ఉపాధ్యాయుల వక్రబుద్ధి
● తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి.. ● ఈఎల్స్‌ను పొందేందుకు అడ్డదారులు ● జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి..

కొండపాక(గజ్వేల్‌): సమాజంలో మార్గదర్శకంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు కొందరు అక్రమాలకు పాల్పడుతూ వృత్తికే మచ్చగా నిలుస్తున్నారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న వారే తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా అడ్డదారులకు తెరలేపారు. ఈ ఘటన కొండపాక మండలంలోని మర్పడ్గలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సమ్మర్‌ క్యాంపునకు వెళ్లకుండానే..

మర్పడ్గ హైస్కూల్‌లో ఏడెనిమిదేళ్లుగా హెచ్‌ఎం భైరయ్యతో పాటు 11 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. సుమారు 140కి పైబడి విద్యార్థులున్నారు. గణిత బోధకురాలిగా పని చేస్తున్న ఉపాధ్యాయురాలు 2018లో చేర్యాలలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో జిల్లా స్థాయి సమ్మర్‌ క్యాంప్‌ను నిర్వహించనప్పటికీ క్యాంప్‌లో డ్యూటీ చేసినట్లుగా తప్పుడు సర్టిఫికెట్‌ సంపాదించారు. వాస్తవానికి సదరు ఉపాధ్యాయురాలి పేరు సమ్మర్‌క్యాంపునకు సంబంధించి డీఈఓ ఉత్తర్వుల్లో కానీ అటెండెన్సు రిజిస్టరులో నమోదు కాలేదు. దీంతో ఉపాధ్యాయురాలు సమ్మర్‌ క్యాంపులో పాల్గొనలేదన్న విషయం స్పష్టమవుతోంది. సదరు ఉపాధ్యాయురాలు అడ్డదారిలో 21 ఈఎల్స్‌ (సంపాదిత సెలవులు) పేరిట డబ్బులు పొందేందుకు 2020లో హెచ్‌ఎం భైరయ్యకు దరఖాస్తు చేశారు. కానీ సర్టిఫికెట్‌ వాస్తవమా కాదా అన్న విషయాన్ని ఏమాత్రం విచారణ చేయకుండానే 2022లో హెచ్‌ఎం 21 ఈఎల్స్‌ మంజూరు ఇవ్వడంతో డబ్బులు డ్రా చేశారు. హెచ్‌ఎం ఇష్టారీతిన వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

విషయం పొక్కిందిలా..

అదే పాఠశాలలో సాంఘిక సబ్జెక్టు బోధకుడిగా పని చేసిన అంజయ్య ఇదివరకు వేసవి సెలవుల్లో ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో విధులు నిర్వర్తించారు. ఈక్రమంలో ఈఎల్స్‌ను పొందేందుకు హెచ్‌ఎం భైరయ్యకు దరఖాస్తు చేసుకున్నారు. మంజూరు చేయడానికి హెచ్‌ఎం నిరాకరించారు. దీంతో సదరు ఉపాధ్యాయురాలి ఈఎల్స్‌ మంజూరు చేసిన విషయాన్ని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా దాట వేశారు. ఈ క్రమంలో హెచ్‌ఎం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్న తీరుపై ఉపాధ్యాయులు చర్చించుకున్న విషయం గుప్పుమంది. ఈ విషయమై ఓ వ్యక్తి హెచ్‌ఎం తీరుపై రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. స్పందించిన విద్యాశాఖ కార్యాలయం దీనిపై సమగ్రంగా విచారణ చేసి రిపోర్టును అందించాలని డీఈఓ కార్యాలయానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో డీఈఓ కార్యాలయ అధికారి హెచ్‌ఎంతో పాటు ఉపాధ్యాయురాలిని వేర్వురుగా విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇదిలా ఉండగా చేర్యాలలోని కేజీబీవీలో సమ్మర్‌ క్యాంపు నిర్వహణ రిజిస్టరును పరిశీలించగా ఈఎల్స్‌ను పొందేందుకు నకిలీ సర్టిఫికెట్‌ సృష్టించిన విషయం బయట పడింది. డీఈఓ కార్యాలయం చేపట్టిన విచారణ, సేకరించిన స్టేట్‌మెంట్‌ రికార్డును రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి పంపించారు. దీంతో కొందరు అఽధికారులు నకిలీ సర్టిఫికెట్‌ ఆధారంగా ఈఎల్స్‌ కాజేసిన విషయం బయటకు రాకుండా పైరవీలు చేస్తున్నట్లుగా సమాచారం. ఈవిషయమై డీఈఓ కార్యాలయ అధికారి రామస్వామిని వివరణ కోరగా విచారణ రిపోర్టును రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి పంపించామన్నారు. పై అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement