సిద్దిపేటజోన్: ఉద్యోగుల ఏడు డీఏలను పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం.. న్యాయం అడిగితే ఉద్యోగ సంఘాలపై ఏసీబీ, విజిలెన్స్ దాడులతో రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తోందంటూ బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో జరిగిన ఉపాధ్యాయ పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతుకను తట్టుకునే పరిస్థితి, సద్విమర్శలు స్వీకరించే ఓపిక ప్రభుత్వానికి లేదన్నారు. 99 రోజుల్లో రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ మంజూరు చేస్తానన్న సీఎం మాట నీటిమూటయిందని విమర్శించారు. సీఎం కుర్చీలో కూర్చొని ఇచ్చిన మాటకు ఒక విలువ ఉండాలని, మాట మీద నమ్మకం పోతే కుర్చీకి, పదవికి గౌరవం ఉండదన్నారు. ఉద్యోగులు జీవితకాలంలో దాచుకున్న డబ్బుల కోసం పదవీ విరమణ తర్వాత ఎదురుచూసే పరిస్థితి నెలకొందని చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో పదవీ విరమణ బెనిఫిట్స్ వచ్చేవని, ఇప్పుడు ఎప్పుడూ వస్తాయో తెలియని గందరగోళంగా ఉందన్నారు. ప్రైవేటు ఆస్పత్రులతో కనీసం ప్రభుత్వం అగ్రిమెంట్ కూడా చేసుకోలేదని, కానీ ఉద్యోగుల జీతాల నుంచి మాత్రం మొదటి, రెండవ నెల అంటూ డబ్బులు కట్ అయిపోతున్నాయని ఆరోపించారు. గతంలో క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ కింద ఉద్యోగుల జీతం నుంచి ఒక శాతం కటింగ్ ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 1.5 శాతం పెంచి డబ్బులు కటింగ్ చేస్తుందని ఆరోపించారు. ఒక ఇంట్లో ఎందరూ ఉద్యోగులు ఉంటే అందరి దగ్గర డబ్బులు కట్ చేస్తున్నారని, కానీ ట్రీట్‌మెంట్ మాత్రం మొదలు కాలేదని విమర్శించారు. ఇప్పటికీ గురుకులాల్లో పిల్లలకు, నోట్‌బుక్స్ రాలేదని, కనీసం ఒక్క జత బట్టలు కూడా ఇవ్వలేదన్నారు. పాఠశాలల్లో బ్రేక్‌పాస్ట్ ప్రారంభమైనా, సిద్దిపేట జిల్లాపైన రాజకీయ కక్షతో ఫేజ్–1లో మన జిల్లా పేరు లేకుండా పూర్తిగా పక్కన పెట్టారని విమర్శించారు. అంతకుముందు గ్రామీణ క్రీడ చిర్రగోనె టోర్నమెంట్‌ను ప్రారంభించి అంతరించిపోతున్న గ్రామీణ క్రీడలను నేటి తరానికి అందించాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.


