నంగునూరు(సిద్దిపేట): హనుమాన్ అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం నంగునూరులోని హనుమాన్ దేవాలయంలో విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా వర్షాలు కురవడం లేదని, కరువు రాకుండా ఉండాలని భగవంతున్ని ప్రార్థించామన్నారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న సర్ ప్రక్రియను పరిశీలించి ఓటర్లకు పత్రాలను అందజేశారు. అలాగే పల్స్‌పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు చుక్కలు వేశారు.
మల్లన్న ఆలయంలో
భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. క్షేత్రానికి చేరుకున్న భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. మరి కొంత మంది భక్తులు కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మకు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆషాఢమాసం ప్రారంభం కానుండటంతో భక్తుల రాక కొంత మేర తగ్గినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ ఈఓ సుధాకర్‌రెడ్డి, సిబ్బంది పర్యవేక్షించారు.
అమ్మను కొలిచి..
మొక్కులు చెల్లించి
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేకువజామునే అర్చకులు వన దుర్గమ్మను పట్టువస్త్రాలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బోనాలు తీసి ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు, ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు.


