తేలని పింఛన్ల
బల్దియాల్లో కొనసాగుతున్న ఫేస్ రికగ్నిషన్
ఆసరా, చేయూత పింఛన్ల లబ్ధిదారుల లెక్క ఇంకా తేలడం లేదు. లబ్ధిదారుల ధ్రువీకరణకు బల్దియాల్లో చేపట్టిన ఫేస్ రికగ్నిషన్ సిస్టం(ఎఫ్‌ఆర్‌ఎస్) సిబ్బందికి సవాల్‌గా మారింది. గత నెల 15 నుంచి జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్ మున్సిపాలిటీల్లో ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియ చేపట్టారు. పూర్తి స్థాయిలో లబ్ధిదారులను గుర్తించేందుకు బల్దియా సిబ్బంది అన్వేషిస్తున్నారు.
– సిద్దిపేటజోన్
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల రికార్డుల ప్రకారం 33,674 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారిలో 28,627మందిని గుర్తించారు. ఫేస్ ప్రక్రియలో ఇంకా 5,047మందిని రికార్డు నమోదు చేయాల్సి ఉంది. వీరిలో సుమారు 1500మంది లబ్ధిదారులు చనిపోయినట్లు సమాచారం. మిగతా 3,547మంది లెక్క తేలాల్సి ఉండగా వారి కోసం ఆయా బల్దియాల్లో సిబ్బంది అన్వేషణ సాగుతోంది. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో 2,533 మంది లబ్ధిదారులకు అక్కడ పోస్ట్ ఆఫీస్ ద్వారా నెలవారీగా పింఛన్లు పంపిణీ జరుగుతున్న నేపథ్యంలో ఫేస్ ప్రక్రియ అవసరం లేకపోయింది.
ఆసరా, చేయూత కింద..
జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, దివ్యాంగులతో పాటు కులవృత్తి చేసే చేనేత, గీత కార్మికుల, కిడ్నీ, ఎయిడ్స్ బాధితులకు ప్రభుత్వం ఆసరా, చేయూత పింఛన్లు మంజూరు చేసింది. వీరికి ఆయా ప్రాంతాల్లో బ్యాంకుల ద్వారా నెలవారీగా పింఛన్లు విడుదల అవుతున్నాయి. పింఛన్లలో అక్రమాలకు, అవినీతికి చెక్ పెట్టి వాస్తవ లెక్క కోసం ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియ చేపట్టారు. అందుకు అనుగుణంగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు, ఆర్పీలు క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుల ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియ ద్వారా ఫొటో, లైవ్ సెల్ఫీలను మొబైల్ ద్వారా తీస్తున్నారు. అదేవిధంగా ఫెషియల్ సిస్టం ఇబ్బందులు అధిగమించేందుకు బయో మెట్రిక్ పద్ధతిలో కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఈ లెక్కన లబ్ధిదారులలో వాస్తవంగా లైవ్ ఐడెంటిటీ పొందుపరిచే ప్రయత్నం చేస్తున్నారు.
పక్కా లెక్క కోసం..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఆసరా, చేయూత ద్వారా అసలు లెక్క తేల్చడం సిబ్బందికి కత్తిమీద సాములా మారింది. 33,674మందికి గాను 28,627మంది ఫేస్ రికగ్నిషన్ సిస్టంలో పొందుపరిచారు. మిగతా 5,047మంది ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియ జరగాల్సి ఉంది. కానీ వీరిలో 1,500 వరకు చనిపోయినట్టు క్షేత్ర స్థాయిలో లభించిన ప్రాథమిక సమాచారం మేరకు తేలింది. మిగతా 3,557లబ్ధిదారుల లెక్క తేలాల్సి ఉంది. కొందరు అందుబాటులో లేకపోవడం, ఆధార్ కార్డుల సీడింగ్ సమాచారం పొంతన లేకపోవడం, ఇతర రాష్ట్రాల్లో ఉండడం, కొందరిని గుర్తింపు సమస్యగా మారడం లాంటి వివిధ కారణాలతో ఫేస్ రికగ్నిషన్ లెక్క కొలిక్కి రాలేదు.
జిల్లా వ్యాప్తంగా 33,674 మందిలబ్ధిదారులు
ఇప్పటి వరకు గుర్తించింది 28,627మందినే..
వివిధ కారణాలతో 5వేల మంది దూరం
వీరిలో చనిపోయిన వారు 1500 పైనే..
మిగతా వారి కోసం అన్వేషణ


