డీఏఓ స్వరూపరాణి
చేర్యాల(సిద్దిపేట): ఈ సీజన్‌లో రైతులు దొడ్డు రకం కాకుండా సన్న వడ్లు వేయాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి అన్నారు. శనివారం పట్టణ పరిధిలోని రామాంజనేయ ఫర్టిలైజర్స్‌ను స్థానిక ఎఓ అప్రోజ్‌తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపులోని స్టాకు రిజిస్టర్లు, బిల్లు బుక్కులను పరిశీలించారు. దుకాణానికి వచ్చిన రైతులతో మాట్లాడిన ఆమె సన్న వడ్లు సాగు చేయాలని వారికి సూచించారు. సన్న రకాల్లో బీపీటీ 5204, హెచ్‌ఎంటీ సోనా, ఆర్‌ఎన్‌ఆర్ 15048, జై శ్రీరాం, కేఎన్‌ఎం1638, కేఎన్‌ఎం7715, డబ్ల్యూజీఎల్44 వంటి ఏడు రకాలను ప్రభుత్వం సూచించిందని తెలిపారు.
ఈ–పాస్ ద్వారానే విక్రయించాలి
మద్దూరు(హుస్నాబాద్): ఎరువుల అమ్మకాలు ఈపాస్ యంత్రం ద్వారానే విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి అన్నారు. శనివారం మండలంలోని పలు ఫర్టిలైజర్ షాపులను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎరువుల విక్రయాలు ఈపాస్ ద్వారానే అమ్మాలని, లేదంటే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవడమేకాకుండా లైసెన్సు రద్దు చేస్తామన్నారు. రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు రశీదు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో దూల్మిట్ట ఏఓ అఫ్రోజ్, ఏఈవోలు ఉన్నారు.
ఐ అండ్ పీఆర్
క్రియేటివ్ డైరెక్టర్‌గా రాజు
మద్దూరు(హుస్నాబాద్): ఐ అండ్ పీఆర్ క్రియేటివ్ డైరెక్టర్‌గా లద్నూరు గ్రామానికి చెందిన కొండ రాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజును నియమించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
పిచ్చిమొక్కల తొలగింపు
వర్గల్(గజ్వేల్): ‘ప్రమాదం కమ్మేస్తోంది’ శీర్షికతో శనివారం ప్రచురితమైన ‘సాక్షి’ కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. వర్గల్ మండలం గుంటిపల్లి బస్టాండ్ వద్ద పిచ్చి మొక్కలు కమ్మేసి ప్రమాదకరంగా మారిన జంట ట్రాన్స్‌ఫార్మర్లను విద్యుత్ ఏఈ వాసుదేవరావు శనివారం పరిశీలించారు. ట్రాన్స్‌ఫార్మర్లను, కరెంటు తీగలను అల్లుకుపోయిన పిచ్చిచెట్లను యుద్ధప్రాతిపదికన తొలగింపజేశారు.
ప్రజలకు ఇచ్చే
గౌరవం ఇదేనా?
మున్సిపల్ కార్యాలయం ఎదుట
బాధితుల ధర్నా
హుస్నాబాద్: సమస్యలు పరిష్కరించాలని వచ్చిన ప్రజలకు గౌరవం ఇవ్వకుండా అధికారులు అవమానించారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం బాధితులతో కలిసి బీఆర్‌ఎస్ నాయకుడు అయిలేని మల్లికార్జున్ రెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ గూడ మల్లారెడ్డికి చెందిన స్థలంలో వేరొకరు అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నారంటూ టౌన్ ప్లానింగ్ అధికారి వద్దకు వస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. మీరు కౌన్సిలరా? ఏ పార్టీ పక్షాన వచ్చారు? అని అడగటం ఏమిటనీ ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి అధికారిని పిలిపించి బాధితుల సమస్యను తెలుసుకున్నారు. మున్సిపల్ కార్యాలయానికి ఎవరు వచ్చినా వారిని గౌరవించి సమస్యను సావధానంగా వినాలన్నారు. బాధితులకు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు.


