గజ్వేల్: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యారంగం అస్తవ్యస్తంగా మారుతోందని డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం గజ్వేల్‌లో విద్యారంగంపై కేంద్ర విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఛాత్రోస్ కీ గూంజ్’లో భాగంగా నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ప్రధాన రహదారి గుండా ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆంక్షారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో జాప్యం, నీట్ పరీక్షల పేపర్ లీకేజీల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీ మాట తప్పారని మండిపడ్డారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ పేదలను నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్‌ఖాన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుఖేందర్‌రెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి
పార్టీ శ్రేణులతో కలిసిగజ్వేల్‌లో నిరసన ర్యాలీ


