హుస్నాబాద్: ఒకే ఒక్కడు ఆరు దుకాణాల్లో చోరీ చేశాడు. భారీ మొత్తంలో బంగారం, నగదును అపహరించాడు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... పట్టణంలోని మెయిన్ రోడ్డులో తెలంగాణ బజార్, రాధికా కిరాణం, శంకర్ క్లాత్ షోరూం, సితార సెలెక్షన్, లావణ్య కిరాణా షాపు, ఆర్టీసీ ఉద్యోగి ఇంట్లో చోరీకి పథకం రచించాడు. వరుస క్రమంలో ఉన్న మూడు ఇళ్లల్లో చోరీకి పాల్పడగా, మిగితా మూడు ఇళ్లలో వీలుకాలేదు. అర్ధరాత్రి దాదాపు ఒంటిగంట సమయంలో భవనాల వెనుక నుంచి ఓ దొంగ ముఖానికి మాస్క్ ధరించి ఇళ్లలోకి చొరబడ్డాడు. దుకాణాదారులు పైఅంతస్తులో నిద్రిస్తున్నారు. పైనుంచి కిందికి ఎవరూ రాకుండా తలుపులు మూసివేశాడు. రాధికా కిరాణంలో 15 తులాల బంగారం, 30 వేలు, లావణ్య కిరాణంలో రూ.12వేలు, తెలంగాణ బజార్‌లో పావు తులం బంగారం, రూ.13 వేలు నగదును ఎత్తుకెళ్లాడు. కాగా దుకాణాదారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్, ఎస్సై లక్ష్మారెడ్డి పరిశీలించారు. దొంగ ఓ భవనంపై వదిలివెళ్లిన తాళం చెవి గుత్తి, పర్స్, బ్యాగ్, దుప్పటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్‌తో వేలి ముద్రలు, ఆధారాలను సేకరించారు. దుకాణాల్లో ఏర్పాటు చేసిన సీసీ పుటేజీలను పరిశీలించగా, ఒక్కడే ముఖానికి మాస్క్ ధరించి చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
బంగారం, నగదు అపహరణ
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ


