రూ.16.20లక్షల చెల్లింపులు
హుస్నాబాద్‌రూరల్: మాజీ సర్పంచ్ ఆత్మహత్యతో పెండింగ్ బిల్లుల చెల్లింపులో అధికారుల్లో కదలిక వచ్చింది. నాలుగు నెలలుగా సాకులు చెప్పిన అధికారులు మహ్మదాపూర్ మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ మరణంతో బకాయి బిల్లులను ఆగమేఘాల మీద క్లియర్ చేస్తున్నారు. మండలంలో అభివృద్ధి పనులకుగాను సర్పంచ్‌లకు చెల్లించాల్సిన నిధులు మొత్తం రూ.38 లక్షల 61 వేల 302 పెండింగ్‌లో ఉన్నాయి. అయితే రెండు రోజుల్లోనే రూ.16 లక్షల 20 వేల 339లకు సంబంధించిన బిల్లులను అధికారులు చెల్లించారు. బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శులను పిలిపించుకొని మరీ బిల్లులు చెల్లిస్తున్నారు. మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకునే వరకు ఏ గ్రామంలో ఎన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనే విషయం అధికారులకు తెలియకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
జీపీడీపీలో లేవని..
పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో నమోదు చేసిన పనులు చేపడితే 15వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్ నుంచి చెల్లిస్తారు. అయితే సర్పంచ్‌లు చేపట్టిన కొన్ని అభివృద్ధి పనులు జీపీడీపీలో లేవని అధికారులు బిల్లుల చెల్లింపులు నిలిపివేస్తున్నారు. ఎంపీఓ, ఎంపీడీఓలు నిబంధనల గురించి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నారు.
మాజీ సర్పంచ్ ఆత్మహత్యతో
అధికారుల్లో కదలిక
రూ.38.61 లక్షల బకాయిలకు


