టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ మెంబర్ సెక్రటరీ
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచగిరి లక్ష్మీ నృసింహక్షేత్రాన్ని శుక్రవారం రాష్ట్ర లీగల్‌సర్వీసెస్ అథారిటీ(టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ) మెంబర్ సెక్రటరీ సీహెచ్ పంచాక్షరి కుటుంబసమేతంగా సందర్శించారు. ఆయనకు ఈఓ రంగాచారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం, హారతి, తీర్థప్రసాదాలు అందజేశారు. శేషవస్త్రంతో సన్మానించారు.
చేప పిల్లల పంపిణీ ఎప్పుడు?
చిన్నకోడూరు(సిద్దిపేట): కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయకుండా మత్స్యకారుల బతుకులు ఆగం చేస్తోందని ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి జంగిటి శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం చిన్నకోడూరులో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసి ఆదుకుంటే, రేవంత్ రెడ్డి పాలనలో మత్స్యకారుల బతుకులు చితికిపోతున్నాయన్నారు. జూలై నెలలో ఉచిత చేప పిల్లలు పంపిణీ చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాపయ్య, యాదగిరి, రాజు, దేవయ్య, రాజేష్, మహేష్, సత్తయ్యలు ఉన్నారు.
పరిశోధనలకు ‘కావేరి’
కృషి అభినందనీయం
వర్గల్(గజ్వేల్): విద్య, పరిశోధన, ఆవిష్కరణలకు కావేరి వర్సిటీ కృషి అభినందనీయమని, జాతీయాభివృద్ధికి తోడ్పడే నాణ్యమైన పరిశోధనలు, విద్యా కార్యక్రమాలను మరింత విస్తరించాలని ఐకార్(ఐసీఏఆర్) మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్‌ఎస్ పరోడా సూచించారు. గౌరారంలోని కావేరి యూనివర్సిటీని సందర్శించారు. చాన్స్‌లర్ జీవీ భాస్కర్‌రావు, వీసీ ప్రవీణ్‌రావుతో కలిసి ఆయన అక్కడి ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ సెంటర్, ప్రయోగశాలలు, డ్రోన్ అకాడమీ, పరిశోధనా క్షేత్రాలు, పాలీహౌస్‌లు, పరిశోధన సదుపాయాలను పరిశీలించారు. అధ్యాపకులు, పరిశోధకులతో మాట్లాడారు. వ్యవసాయరంగంలో సాంకేతికత ఆధారిత పరిశోధనలకు, ఆవిష్కరణలకు చేస్తున్న కృషి భేష్ అని కితాబునిచ్చారు.
బీజేపీ ఎస్సీ మోర్చా
అధ్యక్షుడిగా శివకుమార్
గజ్వేల్‌రూరల్: బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా శివకుమార్ నియామకమయ్యారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతికిరణ్ శుక్రవారం నూతన అధ్యక్షులను ప్రకటించారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్‌పల్లికి చెందిన శివకుమార్ రెండోసారి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా అవకాశం లభించింది. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి సద్వినియోగం చేసుకునేలా తనవంతు కృషి చేస్తానని అన్నారు.
ఏడెకరాల విస్తీర్ణంలో
హరినామ క్షేత్రం
సిద్దిపేటకమాన్: సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లిలో ఏడెకరాల విస్తీర్ణంలో తిరుమల వెంకటేశ్వరుని హరినామ క్షేత్రాన్ని నిర్మిస్తున్నామని టీటీడీ మాజీ ఈవో కేవీ రమణాచారి తెలిపారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో సాయిరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. వచ్చే నెల 2న దేవనాథ్ జీయర్ స్వామి పర్యవేక్షణ, మంగళాశాసనములతో తిరుమల శ్రీవైష్ణవులచే శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కలియుగంలో హరినామ స్మరణ ఎంతో ముఖ్యమైనదన్నారు. ఆసక్తిగల భక్తులు మహత్కార్యంలో భాగస్వాములు కావాలని కోరారు.


