చక్కని జీవితానికి..
సిద్దిపేటకమాన్: జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లలందరికీ ఆదివారం పోలియో చుక్కల పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి వైద్యారోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ రోజు వేయించుకోని చిన్నారులకు 29, 30వ తేదీన వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తారు. పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్ హైమావతి ఆధ్వర్యంలో డీఎంహెచ్‌ఓ ధనరాజ్, వైద్యారోగ్యశాఖ అధికారులు పోస్టర్‌ను ఆవిష్కరించి, ప్రణాళికలు రూపొందించారు. డీఎంహెచ్‌ఓ వైద్యారోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి కార్యక్రమంపై శిక్షణ కూడా ఇచ్చారు. జిల్లాలోని అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్ల లోపు వయసు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు.
ఐదేళ్లలోపు పిల్లలు.. 94,321
జిల్లాలో వైద్యారోగ్యశాఖ నివేదికల ప్రకారం 2,54,286 గృహాలు ఉండగా 10,17,143మంది జనాభా ఉన్నారు. ఇందులో 0నుంచి 5 ఏళ్ల వయసు గల చిన్నారులు 94,321మంది ఉన్నట్లు గుర్తించారు. వీరికి జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు అర్బన్ పీహెచ్‌సీల పరిధిలో 568 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. 32 ట్రాన్సిస్ట్ పాయింట్స్ ఏర్పాటు చేసి, పలు రూట్లలో 57మంది సూపర్‌వైజర్లను నియమించారు. మరో 37 మొబైల్ టీంలు పర్యవేక్షించనున్నాయి. ఆర్టీసీ బస్టాండ్లు, మార్కెట్లు, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. జిల్లాకు వచ్చిన 1,03,800 డోసులను అన్ని పీహెచ్‌సీలకు పంపిణీ చేసినట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ దీప్తి ప్రియాంక తెలిపారు.
రేపే పల్స్ పోలియో
సర్వం సిద్ధం చేసిన వైద్యారోగ్యశాఖ


