సిద్దిపేటరూరల్: ప్రభుత్వం జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ సరఫరా చేస్తున్నక్రమంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ హైమావతి తెలిపారు. ప్రజలు అనవసర భయాందోళనలకు గురై ఎక్కువ సిలిండర్ లను బుక్ చేసుకోరాదన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో ఎల్‌పీజి గ్యాస్ డీలర్లు, సంబంధించిన శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ అవసరాలకు, కేజీబీవీ, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు కొరత రాకుండా వంట గ్యాస్ సరఫరా చేయాలని డీలర్లను ఆదేశించారు. ఎల్పీజి గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది తలెత్తవద్దన్నారు. ఏదైనా సమస్య ఉంటే జిల్లా పౌరసరఫరాల అధికారి దృష్టికి తీసుకురావాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఒక గ్యాస్ సిలిండర్ తేడా వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి తనుజ, డీఈఓ శ్రీనివాసరెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్, డీడబ్ల్యూఓ శారద, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రవాణా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. ఎల్పీజీ గ్యాస్ సరాఫరాపై వినియోగదారుల్లో గందరగోళం నెలకొన్న దృష్ట్యా రాష్ట్ర పౌరసరాఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్యాస్ సరాఫరాపై మంత్రి పలు సూచనలు చేశారు.
కలెక్టర్ హైమావతి
గ్యాస్ సరఫరాపై అధికారులతో సమీక్ష


