వర్గల్(గజ్వేల్): నాచగిరి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వం చేస్తున్నాయి. వాహన సేవలు, హోమాది పూజలతో ఆధ్యాత్మికత వెల్లివిరిస్తోంది. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి శేషవాహనోత్సవ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. శేషతల్పంపై సర్వాలంకార శోభితులై కొలువుదీరిన లక్ష్మీ సమేత నృసింహస్వామివారు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. భజనలు, కోలాటాలతో శ్రీవారి ఊరేగింపు కొనసాగింది. భక్తులు నాచగిరీశుని, అమ్మవారిని దర్శించుకుని తరించారు.
నేడు గరుడసేవ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి పెద్ద గరుడ సేవ జరుగుతుంది. రాత్రి 9 గంటలకు వేడుక ప్రారంభమై ఒంటి గంట వరకు కొనసాగుతుంది.


