అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ స్వప్న
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థుల భవిత ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, మాతృ హృదయంతో బోధించాలని, దేశం గర్వపడే వ్యక్తులుగా తీర్చిదిద్దాలని సెన్సార్ బోర్డు మెంబర్, కేఎంఐటీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ స్వప్న అన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించారు. ముందుగా మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ విద్యార్థులకు తల్లి మొదటి గురువు అని, గురువు మొదటి తల్లి అన్నారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయులు చెప్పిందే నిజమనే ప్రగాఢ విశ్వాసాన్ని కలిగి ఉంటారన్నారు. కార్యక్రమంలో సుజాత, కొత్త వనజ, గంగాధర మనోజ, వివిధ మండలాల నుండి విచ్చేసిన మహిళ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


