ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
సదాశివపేట(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... 50 మంది ప్రయాణికులతో జహీరాబాద్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును సదాశివపేట పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై వైజంక్షన్ మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. తీవ్రంగా గాయపడిన 15 మందితోపాటు, స్వల్పంగా గాయపడిన వారిని 108లో సదాశివపేట, సంగారెడ్డి ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన మేతరి జయమ్మ, మద్దికుంట మహేశ్వరి, గౌసియాబేగం, సోమేశ్వర్, అవుసలి బస్వరాజ్, షేక్ మహబూబ్, గొల్ల కంసమ్మ, హిమబిందు, అంజయ్య, మారుతి, దండు మీనా, కవేలి సరిత, బిడకన్నే రత్నమ్మ, నాగిరెడ్డిపల్లి రాధికలను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించి క్షతగాత్రులకు తక్షణం చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి గురించి ఫోన్‌లో అడిగితెలుసుకున్నారు. ఎస్పీ వెంట డీఎస్సీ సత్తయ్యగౌడ్, సీఐ, పోలీసులు పాల్గొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్ తెలిపారు.
15 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు
సంగారెడ్డి జిల్లాలో ఘటన


