భరోసా కల్పించేలా సర్వేయర్లు పని చేయాలి
సిద్దిపేటరూరల్: భూ రికార్డులపై రైతులకు, యజమానులకు భరోసా కల్పించేలా లైసెన్స్ సర్వేయర్లు పని చేయాలని కలెక్టర్ హైమావతి తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న 110 మంది సర్వేయర్లకు కలెక్టరేట్‌లో కలెక్టర్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లైసెన్స్ సర్వేయర్లను మండలాల వారీగా అందుబాటులో ఉన్న భూమి ఆధారంగా కేటాయింపు చేస్తామన్నారు. భూ భారతి చట్టం అమలు కోసం సర్వేయర్ లకు టెక్నాలజీ కోసం ప్రభుత్వం సామగ్రి పంపిణీ చేస్తుందన్నారు.
పాడి సంపద వృద్ధికి కృషి చేయాలి
కేంద్ర ప్రభుత్వ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కార్యక్రమం ద్వారా రైతులను పాడి సంపద వైపు మళ్లించేలా చూడాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పశు సంవర్థక శాఖ అధికారులతో జూమ్ సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పశు సంపద ఉన్న రైతును కలిసి ఎన్‌డిఎల్‌ఎం యాప్‌లో ఆధార్ సీడింగ్ ప్రక్రియ రోజు వారీగా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా పశు వైద్యశాలల్లో డాక్టర్లు రైతులకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ పశువులకు మంచి వైద్యం, వ్యాక్సిన్లు వేయాలన్నారు. సమావేశంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కొండల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


