నిందితులను శిక్షించాల్సిందే
హుస్నాబాద్: బడుగు, బలహీన వర్గాలపై జరుగుతున్న ఆధిపత్య దాడులను అరికట్టాలని, చిన్నారి మృతికి కారణమైన నిందితులను శిక్షించాలని రజక సంఘం జిల్లా అధ్యక్షుడు జంగపల్లి అయిలయ్య డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో రజక కులస్తులపై దాడిని నిరసిస్తూ రజక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. రజక కులస్తులు వారి వృత్తులను బంద్ చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జంగపల్లి అయిలయ్య మాట్లాడుతూ దళితులు, బడుగు బలహీన వర్గాలపై ఆధిపత్య దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని తెలిపారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా బాధిత రజక కుటుంబానికి న్యాయం జరగాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు వీరన్న యాదవ్, పిడిశెట్టి రాజు, సమ్మయ్య, నాగారం ఉప సర్పంచ్ తిరుపతి, రజక సంఘం నాయకులు పున్న సారయ్య, పున్న రవీందర్ తదితరులు ఉన్నారు.
ఆధిపత్య దాడులను అరికట్టాలి
రజక సంఘం జిల్లా అధ్యక్షుడు
అయిలయ్య డిమాండ్
హుస్నాబాద్‌లో నిరసన ర్యాలీ


