బల్దియా పద్దు రూ.181.99 కోట్లు
గతం కంటే రూ.60 కోట్ల అంచనా అధికం మిగులు కేవలం రూ.6 లక్షలే సిద్దిపేట పాలకవర్గానికి ఇదే ఆఖరు సమావేశానికి హాజరైన కలెక్టర్
సిద్దిపేటజోన్: జిల్లాలో ఏకై క స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేట పాలకవర్గం ఆఖరి పద్దును గురువారం మున్సిపల్ చైర్మన్ మంజుల ఆధ్వర్యంలో కలెక్టర్ హైమావతి సమక్షంలో ప్రవేశపెట్టారు. రెండు నెలల్లో ప్రస్తుత పాలకవర్గం గడువు ముగియనున్న నేపథ్యంలో 2026–27 వార్షిక అంచనాల బడ్జెట్‌ను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. గత ఏడాది అంచనాల బడ్జెట్ కంటే ఈసారి రూ.60కోట్లు అధికంగా అంచనా బడ్జెట్ రూపకల్పన చేశారు.
బల్దియా వార్షిక బడ్జెట్ లెక్కలు పరిశీలిస్తే ఆదాయ అంచనాలకు దగ్గరగా వ్యయ అంచనా బడ్జెట్ ఉండడంతో కేవలం రూ.6లక్షల మిగులు ఉండగా.. 2025–26 సవరణ బడ్జెట్ ముగింపు నిల్వ రూ 2.కోట్ల 14లక్షలతో కలిపి మొత్తంగా 2026–27 వార్షిక బడ్జెట్ మిగులు నిల్వ రూ.2 కోట్ల 20 లక్షలు.
బల్దియా ఆదాయ అంచనా బడ్జెట్ లెక్క మేరకు పన్నుల రూపంలో రూ. 23.50కోట్లు. పన్నేతర ఆదాయ వనరులైన అద్దెలు, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగం ఇతర ద్వారా మొత్తంగా రూ.29కోట్లు. డిపాజిట్లు, అడ్వాన్స్ ద్వారా రూ. 13కోట్ల ఆదాయం. నాన్ ప్లాన్ గ్రాంట్స్, ప్లాన్ గ్రాంట్స్ కలిపి రూ.115కోట్లతో మొత్తంగా ఈ వార్షిక ఆదాయ అంచనా రూ.181 కోట్ల 99లక్షలుగా బడ్జెట్ పొందుపర్చారు.
మున్సిపల్ ఆదాయ అంచనాకు ఏ మాత్రం తగ్గకుండా వ్యయ అంచనా రూపకల్పన జరిగింది. వేతన, జీతాల కోసం రూ 14కోట్లు, హరిత బడ్జెట్ రూ.5కోట్లు, విద్యుత్ చార్జీలు రూ.6.కోట్ల90లక్షలు, శానిటేషన్ నిర్వహణ రూ. 5కోట్లు మొత్తంగా రూ.32కోట్ల ఖర్చు, అదేవిధంగా ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, పరిపాలన విభాగాల నిర్వహణ కోసం రూ.12కోట్లు, మురికివాడల అభివృద్ధి, వార్డుల వారీగా పనుల నిర్వహణ, ఇతరత్రా వ్యయల కోసం ఈ వార్షిక బడ్జెట్‌లో రూ.181కోట్ల93 లక్షల ఖర్చుతో పద్దు పొందుపరిచారు.
రాష్ట్రంలోనే తొలి..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2026–27 బడ్జెట్ సిద్దిపేట బల్దియాలో రూపకల్పన జరిగింది. ఇటీవల మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగడం, కొత్తగా పాలకవర్గాలు రావడంతో బడ్జెట్ ప్రవేశానికి అవకాశం లేకుండా పోయింది. మరోవైపు సిద్దిపేట మున్సిపాలిటీ పాలకవర్గం గడువు రెండు నెలలకు పైగా ఉండడంతో కౌన్సిల్ ఆఖరి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్, వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు అరవింద్, వినోద్, నాగరాజు రెడ్డి, రవి, విఠోభ, మల్లికార్జున్, సతీష్, విజయ్, యోగి, పూర్ణిమ, శోభారాణి, కవిత, బాల్‌లక్ష్మి, రేణుక, దీప్తి, తస్లిమ్, కవిత తదితరులు పాల్గొన్నారు.


