మైనింగ్ మాఫియా.. గుట్టలు స్వాహా..
యథేచ్ఛగా సాగుతున్న తవ్వకాలు
మైనింగ్ మాఫియా చెలరేగిపోతోంది. చాప కింద నీరు చేరినట్టుగా.. నెమ్మది నెమ్మదిగా గుట్టలను మింగేస్తోంది. అక్రమార్కులు మైనింగ్‌ను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వారికి కొంత మంది నేతల అండదండలున్నాయి. దీంతో గుట్టలన్నీ బొందల గడ్డలుగా మారిపోతున్నాయి.
కొమురవెల్లి(సిద్దిపేట): మండల కేంద్రంలోని గుట్టలను అక్రమార్కులు మింగేస్తున్నారు. గుట్టలన్నీ ఖాళీ అవుతున్నాయి. ఎటువంటి అనుమతి లేకుండానే లారీలకు లారీల మట్టి, గ్రానైట్ తరలిపోతోంది. పదుల ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి.
యథేచ్ఛగా తవ్వకాలు
మండల కేంద్రంలోని సర్వే నంబరు 259లోని ప్రభుత్వ భూమిలో ఉన్న నకిరెమ్మగుట్ట, నల్ల ఏనేలను అక్రమార్కులు మాయం చేస్తున్నారు. ఆమట్టిని ప్రైవేట్ వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వెంచర్లకు ట్రిప్పర్ మట్టికి రూ.6 వేలు, ట్రాక్టర్ గ్రానైట్‌కు రూ.6 వేలు చొప్పున అమ్ముకొంటున్నారు. ఈ వ్యవహారం కొద్ది రోజులుగా సాగుతోంది. అయినా అధికారులు మాత్రం అక్రమ తవ్వకాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం
మండల కేంద్రంలోని నకిరెమ్మగుట్ట, నల్ల ఏనేలకు అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. తవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
– దివ్య, కొమురవెల్లి తహసీల్దార్
అనుమతి లేకుండా మట్టి, గ్రానైట్ అక్రమ తవ్వకాలు నిర్వహించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. అక్రమార్కులు అధికారులను ప్రసన్నం చేసుకుని అడ్డదారుల్లో మైనింగ్ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. బహిరంగంగా మైనింగ్ జరుగుతున్నా టాస్క్‌ఫోర్స్ అధికారులు దృష్టిసారించకపోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రైవేట్ వెంచర్లకు మట్టి, గ్రానైట్ అమ్మకాలు
మాయమవుతున్న గుట్టలు
పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు


