ఇంటి వద్దకే ‘సీతారాముల’ తలంబ్రాలు
సంగారెడ్డిటౌన్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లలో భక్తుల కోసం కార్గో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. విశిష్టత కలిగిన ఈ తలంబ్రాల ప్యాకెట్లను పొందడానికి భక్తుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌లో బుకింగ్ చేసుకొనే అవకాశం కల్పించారు.
డిపోలలో ప్రత్యేక ఏర్పాట్లు
అత్యంత నియమనిష్ఠలతో గోటితో వలిచిన కోటి బియ్యం గింజలను సీతారాముల కల్యాణ ంలో తలంబ్రాలుగా వాడుతారు. అయితే అక్కడకు వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారి తలంబ్రాలను నేరుగా భక్తుల ఇంటికే చేర్చేందుకు ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది డిపోలలో అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. రూ.151 చెల్లించి వెబ్‌సైట్ www.tfrrtcofirticr.co.in ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్‌లను డిపో అధికారులు విడుదల చేశారు.
భక్తులు సద్వినియోగం చేసుకోవాలి
భద్రాచలంలోని సీతారాముల కల్యాణంలో వినియోగించే తలంబ్రాలను ఆర్టీసీ ద్వారా నేరుగా కార్గోలో ఇంటికి చేర్చే అవకాశం కల్పించాం. అందుకోసం ప్రతి డిపోలోను ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశాం. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లను సంప్రదించి ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలి.
– విజయ భాస్కర్, మెదక్ రీజినల్ మేనేజర్
ఆర్టీసీ కార్గో ప్రత్యేక సేవలు
రూ.151తో నేరుగా భక్తుల చెంతకే.. .
సద్వినియోగం చేసుకోవాలి: ఆర్టీసీ అధికారులు


