శాంతిభద్రతల పరిరక్షణకే కవాతు
సీపీ సాధన రష్మి
హుస్నాబాద్: శాంతిభద్రతల పరిరక్షణకే కవాతు నిర్వహించినట్టు పోలీస్ కమిషనర్ సాధన రష్మి అన్నారు. పట్టణంలోని పురవీధుల గుండా రాపిడ్ యాక్షన్ ఫోర్స్, పోలీస్ సిబ్బందితో కలిసి గురువారం ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించడం వల్ల ఇక్కడి ప్రాంతాలపై అవగాహన కలుగుతుందన్నారు. జిల్లాలో పలు పట్టణాల్లో కవాతు నిర్వహించినట్లు చెప్పారు. మత ఘర్షణలు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులకు రాపిడ్ ఫోర్స్ సహకరిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి అయేషా ఫాతిమా, రాపిడ్ ఫోర్స్ డిప్యుటీ కమాండర్ సరస్వతి, ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.


