మౌలిక వసతులు కల్పిస్తా
ఎంపీ రఘునందన్ రావు
జిన్నారం (పటాన్‌చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలోని కాజీపల్లి, జీఎంఆర్ కాలనీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు శుక్రవారం పర్యటించారు. కాలుష్య ప్రాంతమైన కాజీపల్లి జీఎంఆర్ కాలనీలలో మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని ఎంపీని స్థానికులు విజ్ఞప్తి చేశారు. కాలుష్యానికి గురైన కాల్వలు చెరువులను పరిశీలించిన ఎంపీ.. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల అవ సరాలకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ రమాకాంత్, మండల బీజేపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి పాల్గొన్నారు.
కూల్చడం తప్ప..
కట్టడం తెలియదు: ఎమ్మెల్యే
జహీరాబాద్: కోహీర్ మండలంలోని సజ్జాపూర్‌కు చెందిన బేగరి రాములుకు ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. శుక్రవారం ఆయన గ్రామాన్ని సందర్శించారు. రాములుకు సంబంధించిన రేకుల ఇంటిని కూల్చి వేయించడంతో వివాదానికి దారితీసింది. ఎమ్మెల్యే మాణిక్‌రావు బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణ సహాయం కింద బాధితుడికి ఆర్థిక సహాయం అందించామన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదనే కక్షతోనే ఇంటిని కూల్చివేయించారని, కాంగ్రెస్ నాయకులకు కూల్చడం తప్ప కట్టడం తెలియదని విమర్శించారు. బాధిత కుటుంబానికి నూతన గృహం నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ నాయకులు బండి మోహన్, నామ రవికిరణ్, భూమయ్య, మచ్చేందర్, రవికిరణ్, రాజశేఖర్, సంపత్, నర్సింహులు పాల్గొన్నారు.


