యాసంగి పంటలకు నీరందించండి
దుబ్బాక: మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాల్వలు పూర్తయినప్పటికీ మిగిలిన పంట కాల్వలు త్వరగా పూర్తిచేసి యాసంగికి నీరందించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అసెంబ్లీలో విన్నవించారు. సోమవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం అనుసంధానంగా నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మించి చెరువులు, కుంటలు నింపే ప్రధాన కాల్వలు పూర్తయినా పంట కాల్వలు పూర్తికాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై ఇరిగేషన్ మంత్రి, అధికారులకు పలుసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. యాప్‌లు పెట్టి ఇబ్బందులు పెట్టకుండా రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలన్నారు. గత వానాకాలంలో యూరియా కొరతతో పంటల దిగుబడి చాలా తగ్గిందని, ఈసారి అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కరెంట్ కష్టాలు సైతం రైతులకు ఎక్కువయ్యాయని అన్నారు. ప్రభుత్వం రైతుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ సమావేశాలకు సోమవారం హాజరైన మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎమ్మెల్యే పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
వేగిరంగా కాల్వలు పూర్తిచేయండి
అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి


