తగ్గని నేరాలు
గతేడాది కంటే పెరిగిన 291 కేసులు
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే 4శాతం నేరాల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 7,144 కేసులు నమోదు కాగా 2024లో 6,853 కేసులు నమోదయ్యాయి. దీంతో గతేడాదికంటే 291 కేసులు పెరిగాయి. ఆస్తి కోసం హత్యలు, చైన్ స్నాచింగ్‌లు, దోపిడీ కేసులు పెరిగాయి. అత్యాచార, పోక్సో చట్టం, మహిళలపై నేరాలు తగ్గాయి. జిల్లాలో స్వల్పంగా రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. నేరాల శిక్షలను పరిశీలిస్తే గతేడాది వివిధ కేసుల్లో నేరస్తులకు 48శాతం పడగా ఈ ఏడాది పలు కేసుల్లో 42శాతం శిక్షలు విధించారు.
– సాక్షి, సిద్దిపేట/సిద్దిపేట కమాన్
రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు మరణాలు సైతం తగ్గాయి. ఈ ఏడాది 716 రోడ్డు ప్రమాద కేసులు నమోదుకాగా అందులో 274 మరణాలు, 599 మంది గాయపడ్డారు. 2024లో 718 కేసులు, 315 మరణాలు కాగా 645 మందికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు కొరఢా ఝుళిపించారు. ఈ ఏడాది 4,52,776 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు కాగా వారికి రూ. 16,73,29,000 జరిమానా విధించారు. గతంతో పోలిస్తే 14శాతం పెరిగింది. రాజీవ్ రహదారిపై స్పీడ్ లేజర్ గన్ ద్వారా 61,147 ఓవర్ స్పీడ్ కేసులు నమోదు చేయగా రూ. 6,32,67,845 జరిమానా విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానా వేస్తున్నారు. దీంతో మద్యం సేవించి వాహనాలు నడిపేందుకు వాహనదారులు జంకుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో, గ్రామాలలో అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, ప్రజలకు ట్రాఫిక్, రహదారి భద్రతా సమస్యలు, డ్రైవింగ్ నిబంధనలు, అవగాహన కల్పించారు. సిద్దిపేట మండలం రాంపల్లి గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్ సిహెచ్ బాలమల్లయ్య రహదారి భద్రతా సమస్యలపై వివిధ రహదారి భద్రతా కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు.
తగ్గిన దొంగతనాలు
కమిషనరేట్ పరిధిలో దొంగతనాలు తగ్గినప్పటికీ చైన్ స్నాచింగ్‌లు పెరిగాయి. గతేడాది 759 దొంగతనాలు జరగగా ఈ ఏడాది 731 నమోదయ్యాయి. ఈ దొంగతనాల్లో 5,07,67,840 విలువైన ఆస్తి, నగదు పోగా అందులో రూ. 1,42,69,301 విలువైన ఆస్తిని రికవరీ చేశారు. దోపిడీ కేసులు 2024లో 7 నమోదు కాగా ఈ ఏడాది 12కి పెరిగాయి. పలు ముఖ్యప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పోలీసులు చెబుతున్నా చైన్ స్నాచింగ్‌లు ఆగడం లేదు. చైన్ స్నాచింగ్‌లు 2014లో 9 కాగా ఈ ఏడాది 13 జరిగాయి.
గేమింగ్ యాక్ట్ కింద 77 కేసులు
ఈ ఏడాది గేమింగ్ చట్టం కింద 77 కేసులు నమోదు చేసి రూ. 11,25,700 సీజ్ చేశారు. ఎప్పుడు లేని విధంగా సిటిజన్ క్లబ్ పై మెరుపు దాడి నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పేకాట ఆడుతున్న 50 మంది పై కేసులు నమోదు చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాప్‌లను కట్టడిలో భాగంగా ఎకై ్సజ్ చట్టం 440 కేసులు, అక్రమ ఇసుక రవాణా 203 కేసులు నమోదు అయ్యాయి.
కోడ్ ఉల్లంఘన..
గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి, మోడల్ కోడ్ కండక్ట్‌ను పకడ్బందీగా చేపట్టారు. కోడ్ ఉల్లంఘనలో 507 కేసులు నమోదయ్యాయి. అందులో 271 మద్యం కేసులు నమోదు చేసి 5,181 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. సరియైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ 30,36,620 నగదును సీజ్ చేశారు.
అక్రమార్కులపై ఉక్కుపాదం
వీధి రౌడీలు, మోసగాళ్లు, చట్టాన్ని ఉల్లంఘించేవారితో పాటు, అక్రమార్కుల పై కఠినంగా వ్యవహరించి ఉక్కు పాదం మోపుతాం. పారదర్శకంగా, అవినీతి రహితంగా, బాధ్యతాయుతమైన పోలీసింగ్ వ్యవస్థను నిర్వహిస్తాం. సాధారణ పౌరులకు భద్రతా కల్పిస్తూ, కఠినమైన పద్ధతిలో చట్టాన్ని అమలు చేస్తాం. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనదారులకు అవగాహనపెంచుతాం.
– విజయ్ కుమార్, సీపీ
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బ్యాటరీలు, వాహనాలు
మహిళలపై తగ్గిన వేధింపులు
జిల్లాలో మహిళలపై వేధింపులు తగ్గాయి. షీ టీంలు నిఘా ఏర్పాటు చేసి ఈవ్ టీజింగ్‌కు పాల్పడే పోకిరీల ఆటకట్టించారు. 2024లో అత్యాచార కేసులు 80 నమోదు కాగా ఈ ఏడాది 53 అయ్యాయి. దీంతో గతేడాదిలో పోలిస్తే 27 తగ్గాయి. పోక్సో చట్టం కేసులు గతేడాది 97 కాగా ఈ ఏడాది 79 అయ్యాయి. గతేడాది కంటే ఇప్పుడు 18 తగ్గాయి. మహిళలపై నేరాల కేసులు 2024లో 589 నమోదు కాగా నుంచి 572 కేసులు నమోదయ్యాయి.
పెరిగిన హత్యలు,
చైన్ స్నాచింగ్‌లు, దోపిడీలు
రోడ్డు ప్రమదాలు, మరణాలు తగ్గుముఖం
ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు 507
తగ్గని నేరాలు


