పేదల పక్షాన పోరాటం
● సీపీఐ జిల్లా కార్యదర్శి పవన్ ● గజ్వేల్‌లో పార్టీ జెండావిష్కరణ
గజ్వేల్‌రూరల్: అంతరాలు లేని సమాజ స్థాపనే లక్ష్యంగా, పేదల పక్షాన నిరంతరం సీపీఐ పోరాటాలను కొనసాగిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్ పేర్కొన్నారు. సీపీఐ 101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ఇందిరాపార్కు చౌరస్తా వద్ద ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాన్పూర్‌లో 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన సీపీఐ నాటి నుంచి నేటి వరకు అనేక ఉద్యమాలు, పోరాటాలను నిర్వహించిందని గుర్తు చేశారు. చట్టసభల్లో కార్మికులు, కర్షకులు, విద్యార్థుల కోసం అనేక చట్టాలను చేయించిన ఘనత సీపీఐకే ఉందన్నారు. దేశ స్వాతంత్య్రంలో, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర ఉందన్నారు. సీపీఐ పార్టీకి వందేళ్లు పూర్తయిన సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో జరిగే శతజయంతి ముగింపు ఉత్సవాల భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దయానందరెడ్డి, జనార్ధన్, నియోజకవర్గ ఇన్‌చార్జి శివలింగు కృష్ణ, సభ్యులు రాజేశం, పోచయ్య, సాయిలు, చింత శ్రీను తదితరులు పాల్గొన్నారు.


