టెన్త్‌లో టాప్‌గా నిలవాలి
● మాజీ మంత్రి హరీశ్‌రావు ● విద్యార్థుల తల్లిదండ్రులకు ఉత్తరాలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): త్వరలో జరగనున్న టెన్త్ పరీక్ష ఫలితాల్లో సిద్దిపేట టాప్‌లో నిలవాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని పదోతరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు ఉత్తరాలు రాశారు. పలు సూచనలు చేశారు. చదువును నమ్ముకున్న వారంతా తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారన్నారు. నిరుపేద కుటుంబాల్లో జన్మించి మంచి చదువులు చదివి దేశాలను పాలించే స్థాయికి ఎదిగారన్నారు. ప్రణాళిక బద్దంగా చదివితే ఉత్తమ మార్కులు సాధించే అవకాశం ఉందన్నారు. ‘కొద్ది రోజుల్లోనే మీ పిల్లలు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. మంచి మార్కులతో గట్టెక్కితేనే ఉన్నత చదువుల దిశగా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది’ అని అన్నారు. లేదంటే మీరు ఇన్నాళ్లు పడిన కష్టానికి, మీ పిల్లల చదువుకు ఎలాంటి అర్థం ఉండదని తెలిపారు. విద్యార్థులను సెల్ ఫోన్లకు, విందులు, వినోదాలు, ఫంక్షన్లు, సినిమాలు, టీవీల జోలికి వెళ్లకుండా చూడాలన్నారు. నా వంతుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులతో పాటు అల్పాహారం ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు. మార్కులు సాధించేందుకు కంటెంట్ పుస్తకాలు పంపిస్తున్నానని చెప్పారు.


