
నిర్లక్ష్యం వహిస్తే జీతం కట్
● వైద్య సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం ● నారాయణరావుపేట మండల కేంద్రంలో పర్యటన
సిద్దిపేటరూరల్: వైద్య సిబ్బందిపై కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే జీతం కట్ చేస్తామని హెచ్చరించారు. మంగళవారం నారాయణరావుపేట మండల కేంద్రంలో కలెక్టర్ హైమావతి పీహెచ్‌సీని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, డ్రై డేను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ సందర్శించి హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్ బాపురెడ్డి లీవ్‌లో ఉన్నట్లు తెలపగా డీఎంహెచ్‌ఓకు ఫోన్ చేసి తెలుసుకున్నారు. ఇతర హెల్త్ సూపర్‌వైజర్లు సునీత, పాండురంగాచారి, సుధారాణిలు ఫీల్డ్‌కు వెళ్లారని చెప్పడంతో కలెక్టర్ వారికి వీడియో కాల్ చేసి తెలుసుకున్నారు. దీంతో 10.30 గంటలైనా విధులకు వెళ్లకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రోజు వేతనాన్ని నిలిపివేయాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. వైద్య సిబ్బందిపై ఎంపీడీఓ తరచూ పర్యవేక్షణ ఉండాలన్నారు. జ్వరంతో ఆస్పత్రికి వచ్చిన వారితో కలెక్టర్ మాట్లాడారు. కాచి చల్లార్చిన నీటి నే తాగాలని సూచించారు. ఇంటితో పాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. శుక్రవారం డ్రై డే నిర్వహించేలా ప్రజల్లో అవగా హన తీసుకురావాలన్నారు. మండల కేంద్రంలో 68 ఇళ్లు మంజూరుకాగా, కేవలం 48 మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ త్వరగా ఇంటి నిర్మాణం చేపట్టాలని, నిధులు అకౌంట్లో జమ అవుతాయన్నారు.
మట్టి విగ్రహాలను పూజిద్దాం
సిద్దిపేటరూరల్: ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి, పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మంగళవారం కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సహజ రంగులు ఉపయోగించి తయారు చేసిన మట్టి విగ్రహాలను పూజించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం అవుదామన్నారు.