
యూరియా పక్కదారి
● పక్క గ్రామాల్లో విక్రయాలు ● ఆందోళనకు దిగిన రైతులు ● జ్యోతి ఫర్టిలైజర్ దుకాణాన్నిసీజ్ చేయాలని డిమాండ్
దౌల్తాబాద్ (దుబ్బాక): యూరియా పక్కదారి పట్టింది. టోకెన్లు ఉన్న రైతులకు సైతం ఇవ్వకుండా అడ్డదారిలో పక్క గ్రామాల్లో గుట్టుగా విక్రయించారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. జ్యోతి ఫర్టిలైజర్ దుకాణాన్ని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన జ్యోతి ఫర్టిలైజర్ యజమాని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు యూరియా కోసం టోకెన్లు ఇచ్చారు. అయితే టోకెన్లు తీసుకున్న రైతులకు కాకుండా మండల పరిధిలోని నర్సంపేటలో రెండు లారీల యూరియాను అక్రమంగా డంపింగ్ చేసి గుట్టుగా బస్తాకు రూ.350లకు అమ్మేశాడు. మంగళవారం విషయం తెలుసుకున్న రైతులు మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తాలో ధర్నాకు దిగి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జ్యోతి ఫర్టిలైజర్ దుకాణాన్ని సీజ్ చేయాలని, దుకాణ యజమాని గోపిశెట్టి శ్రీనివాస్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటలకు పైగా ధర్నా చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఏసీపీ నర్సింహులు, తొగుట సీఐ లతీఫ్, దుబ్బాక ఏడీఏ మల్లయ్య అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. జ్యోతి ఫర్టిలైజర్ యజమాని గోపిశెట్టిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.