
తనిఖీలు సరే.. రికవరీ ఏదీ?
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారింది. ప్రతీ ఏటా ఉపాధి పనులపై సామాజిక తనిఖీలు నిర్వహించి అవకతవకలను వెల్లడిస్తారు. కానీ బాధ్యుల నుంచి సొమ్ము రికవరీ చేయడం లేదు. 2018 నుంచి 2025 మార్చి వరకు జరిగిన సామాజిక తనిఖీల్లో రూ.6.71కోట్లు అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. కానీ రికవరీ అంతంత మాత్రంగానే జరుగుతోంది. దీంతో అధికారుల తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ●
● మద్దూరు మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలో 1 ఏప్రిల్ 2023 నుంచి 31 మార్చి 2024 వరకు ఉపాధిహామీ పథకంలో రూ.9.60 కోట్లతో చేసిన 1122 పనులకు సామాజిక తనిఖీ నిర్వహించారు. జనవరి 9న మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సామాజిక తనిఖీలో లక్షలాది రూపాయలు అక్రమాలు జరిగినట్లు తేల్చారు. పని జరగకపోయినా పని జరిగినట్లు రికార్డుల్లో పొందుపర్చడం, మస్టర్‌లో సంతకాలు లేకుండా చెల్లింపులు చేయడం, తక్కువ పనికి ఎక్కువ చెల్లింపులు జరిగినట్లు తనిఖీ బృందం నిర్ధారించింది. కానీ రికవరీ జాడలేదు.
● మిరుదొడ్డి మండలంలో మార్చి 17న ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. 2024–25లో రూ.2.03,463 అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికీ రెండు నెలలు కావస్తున్నా రికవరీ కాలేదు.
సాక్షి, సిద్దిపేట: గ్రామీణ పేదలకు పనులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. ఉపాధి హామీ పనులలో భాగంగా గ్రామ పంచాయతీల్లో నర్సరీల పెంపకం, మొక్కలు నాటడం, చెరువులు, కుంటలు, బావుల్లో పూడిక తీయడం, కల్లాల నిర్మాణం చేపడుతున్నారు. పనుల్లో పారదర్శకత పాటించేందుకు సామాజిక తనిఖీ విధానాన్ని తీసుకవచ్చారు. ఏ స్థాయిలో అవినీతి జరిగినా ప్రజావేదికలో తెలిపోనుంది. పనుల్లో నాణ్యత లేకపోయినా అడిగేవారు కరవయ్యారు. అవకతకలు గుర్తిస్తున్నా మార్పు కనిపించడం లేదు.ఈ పథకంలో ఎక్కువగా కాంట్రాక్ట్ సిబ్బంది ఉండటంతోనే నిధుల దుర్వినియోగం ఆగడం లేదు.
రూ.5.36 కోట్లు పెండింగ్
జిల్లా వ్యాప్తంగా 1.97లక్షల జాబ్ కార్డులుండగా 3.94 లక్షల మంది ఉపాధి కూలీలున్నారు. జిల్లాలో ప్రతీ ఏడాది ఉపాధి పనులపై సామాజిక తనిఖీలు నిర్వహిస్తుంటారు. 2018– 25 వరకు 38,722 పనుల్లో జరిగిన అవకతవకల్లో రూ.6,71,42,134 అక్రమార్కులు సొంతానికి వాడుకున్నట్లు తనిఖీల ద్వారా బయటపడింది. వీటిలో ఇప్పటి వరకు కేవలం రూ.1,34,86,250 మాత్రమే రికవరీ అయ్యాయి. ఇంకా రూ.5,36,55,884 రికవరీ పెండింగ్‌లో ఉంది. సామాజిక తనిఖీలపై పెట్టిన దృష్టి మండల స్థాయి అధికారులు రికవరీపై పెట్టకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రికవరీ లేకపోవడంతో ఉత్తుత్తి సామాజిక తనిఖీలుగానే మిగిలిపోతున్నాయి.
నో ఫీల్డ్ విజిట్..
జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఉపాధి పనుల్లో అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అధికారులు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్‌లు చేయకపోవడంతో సిబ్బంది ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా చేస్తున్నారు. కూలీలు పనులు చేయకున్నా... చేసినట్లు రికార్డు చేస్తున్నారు. అంతేకాకుండా పనులు ఎక్కడ చేస్తున్నారనేది అధికారులకు తెలియడం లేదు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు దృష్టి సారించి ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
ప్రత్యేక డ్రైవ్ చేపడతాం
ఉపాధి పనులపై సామాజిక తనిఖీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. వాటిలో తేలిన అవకతవకలను బహిర్గతం చేస్తున్నాం. గోల్‌మాల్ జరిగిన డబ్బులను రివకరీ కోసం ప్రత్యేక డ్రైవ్‌ను త్వరలో ఏర్పాటు చేస్తాం. రెండు నుంచి మూడు నెలల్లో దాదాపు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తాం.
–జయదేవ్, డీఆర్‌డీఓ
ఉపాధిలో అక్రమాలు వెలుగు చూస్తున్నా చర్యలు అంతంతే
2018–25 వరకు 38వేల పనుల్లో అవకతవకలు
రూ.6.71 కోట్ల గోల్‌మాల్ జరిగినట్లు నిర్ధారణ
అయినా ఇప్పటి వరకు రూ.1.34కోట్లే స్వాధీనం
ఇంకా పెండింగ్‌లోనే రూ.5.36కోట్లు