
ఇక అటవీ శాఖ ముద్ర
● చెట్ల నరికివేతకు అనుమతి తప్పనిసరి
● ప్రభుత్వ శాఖల మధ్య కోల్డ్ వార్‌కు చెక్
● ట్రాన్స్‌కోకు నోటీసుల జారీలో మున్సిపల్ యంత్రాంగం
పిట్టపోరు.. పిట్టపోరు.. పిల్లి తీర్చినట్లు జిల్లా కేంద్రంలో విద్యుత్, మున్సిపల్ శాఖల మధ్య కొంతకాలంగా నెలకొన్న చెట్ల నరికివేత అంశం అటవీశాఖ చేతుల్లోకి వెళ్లింది. ఇక నుంచి పట్టణంలో చెట్లు నరికివేసేందుకు అటవీశాఖ అనుమతి తప్పనిసరి. ఈ మేరకు మున్సిపల్ అధికారులు.. అటవీశాఖ అనుమతి పత్రం ఉంటేనే పట్టణంలో హరితహారం చెట్లను తొలగించాలని ట్రాన్స్‌కోకు అధికారికంగా నోటీసులు జారీ చేసే పనిలో ఉన్నారు.
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలో కొన్నేళ్లుగా హరితహారం కింద మొక్కలు నాటారు. అదే క్రమంలో ప్రస్తుత ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. కొంత కాలంగా విద్యుత్ వైర్లను పొడవాటి చెట్ల కొమ్మలు తాకడం, విద్యుత్ సరఫరాలో సమస్యల దృష్ట్యా విద్యుత్ శాఖ చెట్లను తొలగిస్తోంది. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ, ఇరు శాఖల సమన్వయ లోపంతో కొన్ని ప్రాంతాల్లో చెట్ల మొదళ్ల వరకు తొలగించారు. ఇదే అంశంపై ఇరు శాఖల్లో కొంత అగాధం ఏర్పడింది. ఈ క్రమంలో ఇరు శాఖలు ఎవ్వరికీ వారు యమునా తీరు అన్నట్లు వ్యవహరించాయి.
పెద్ద ఎత్తున జరిమానాలు
మరోవైపు పట్టణంలో ఏపుగా పెరిగిన చెట్లను వివిధ కారణాలతో పలువురు తొలగించారు. అలాంటి సంఘటనలపై బల్దియా స్పందించి జరిమానాతోపాటు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుల వరకు వెళ్లింది. రూ.500 నుంచి రూ.లక్ష వరకు జరిమానా రూపంలో బల్దియా విధించింది. ఈ లెక్కన ప్రతి ఏడాది సగటున రూ. 50 వేలు జరిమానా పేరిట బల్దియాకు ఆదాయం సమకూరింది.
అటవీశాఖ జోక్యం
విద్యుత్, మున్సిపల్ శాఖల మధ్య నెలకొన్న సమస్య పరిష్కారానికి అటవీశాఖ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా చెట్లను నరకడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక భవిష్యత్తులో ప్రభుత్వ శాఖలు, ఇతర వ్యక్తులు చెట్లను తొలగించే అంశంపై అటవీశాఖ అనుమతి తప్పనిసరి అని నిబంధన విధించింది. అందుకు అనుగుణంగా ఇరు శాఖలకు సూచనలు చేసింది. ఇప్పటివరకు విద్యుత్, మున్సిపల్ శాఖల పరస్పర అవగాహన మేరకు విద్యుత్ వైర్ల కింద ఉన్న చెట్లు తొలగించారు. ఇక భవిష్యత్తులో ఇరు శాఖలు అటవీశాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది. అందులో భాగంగానే పట్టణంలో చెట్లు నరికేందుకు అటవీశాఖ అనుమతి లేఖ బల్దియాకు అందజేయాలని మున్సిపల్ అధికారులు విద్యుత్ శాఖకు అధికారికంగా నోటీస్ జారీ చేసే పనిలో నిమగ్నమైంది.
అనుమతి ఉంటేనే..
సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో చెట్లను తొలగించడానికి అటవీశాఖ నుంచి అనుమతి తప్పనిసరి. అందుకు సంబంధించిన అంశాలను నోటీసు రూపంలో విద్యుత్ శాఖ అధికారులకు పంపించడానికి చర్యలు తీసుకుంటున్నాం. – ఆశ్రిత్, మున్సిపల్ కమిషనర్