
అభివృద్ధి నిరంతర ప్రక్రియ
● గ్రామాలను ప్రగతి బాట పట్టిస్తాం
● త్వరలో గౌరవెల్లిని నింపి సస్యశ్యామలం చేస్తాం
● మంత్రి పొన్నం ప్రభాకర్
అక్కన్నపేట(హుస్నాబాద్): అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమం శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండలంలోని కట్కూర్, గొల్లకుంట, అక్కన్నపేట, కేశనాయక్‌తండా, కుందనవానిపల్లి, గండిపల్లి, రామవరం, మల్‌చెర్వుతండా, గోవర్ధనగిరి గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణానికి శంకుస్థాపనులు, నూతన జీపీ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎక్కడికక్కడా అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
హుస్నాబాద్‌కు గుండెకాయ గౌరవెల్లి
గౌరవెల్లి ప్రాజెక్టు హుస్నాబాద్‌కు గుండెకాయ లాంటిదన్నారు. ప్రాజెక్టు కోసం ఈ ప్రాంత రైతాంగం ఏళ్లుగా ఎదురుచూస్తోందన్నారు. త్వరలో ఎన్జీటీ కేసును సైతం తొలగిస్తామన్నారు. అందరి సహకారంతో త్వరలో గౌరవెల్లి గోదావరి జలాలతో నింపి ఈ ప్రాంతాన్ని పూర్తిగా సస్యశ్యాలమం చేస్తామన్నారు.
భూ సమస్యలు పరిష్కరిస్తాం..
నందారం, కపూర్‌నాయక్‌తండా గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను పరిషరిస్తామని మంత్రి చెప్పారు. కొన్నేళ్లుగా సాగు చేసుకుంటూ జీవిస్తున్న రైతులకే పట్టా హక్కులు కల్పించేలా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి
హుస్నాబాద్‌రూరల్: పల్లె ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి పొన్నం వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ మెరుగైన వైద్యం అందించాలనే మీర్జాపూర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రూ.2కోట్లతో నిర్మించామని అన్నా రు. అభివృద్ధి పనులను వేగంగా పర్తి చేయాలని ఆదేశించారు. మహిళ సంఘాలకు స్టీల్ బ్యాంక్‌ను అందించారు.