
యూరియా.. తిప్పలు ఇంతింత కాదయా
● అర్ధరాత్రి నుంచే క్యూలైన్‌లో రైతులు
● రోజంతా ‘చెప్పు’ కోలేని పాట్లు
జిల్లాలో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మిరుదొడ్డి పీఏసీఎస్ కేంద్రానికి శుక్రవారం యూరియా లారీ వస్తుందని తెలుసుకున్న పలు గ్రామాలకు చెందిన రైతులు అర్ధరాత్రి నుంచే క్యూ కట్టారు. ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తే లైను పోతుందేమోనన్న బెంగతో చెప్పులను క్యూలో పెట్టి బయటకు వెళ్లారు. మహిళా రైతుల పరిస్థితి అంతాఇంతా కాదు. సుమారు 3 వేల మంది రైతులు బారులు తీరడంతో టోకెన్లు ఇవ్వడానికి అధికారులకు సైతం తిప్పలు తప్పలేదు. టోకెన్ కౌంటర్ ఒకటే ఉండటంతో రైతుల మధ్య కాసేపు తోపులాటకు దారి తీసింది. యూరియా లారీ రావడంతో టోకెన్లు అందుకున్న రైతులకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. అందనివారు నిరుత్సాహంగా వెనుదిరగాల్సి వచ్చింది. దుబ్బాకలోనూ ఇదే దుస్థితి నెలకొంది. వచ్చిన 560 సంచుల కోసం 2 వేల మందికి పైగా బారులు తీరడం విశేషం. హుస్నాబాద్‌లో బీఆర్‌ఎస్ నాయకులు మంత్రి తుమ్మల దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. దౌల్తాబాద్‌లోని రైతు వేదిక వద్ద రైతులు యూరియా కోసం గంటలకొద్దీ నిరీక్షించారు.
– మిరుదొడ్డి(దుబ్బాక)/దుబ్బాకటౌన్/హుస్నాబాద్