
మూడెకరాల భూమి ఏమాయె
అక్కన్నపేట(హుస్నాబాద్): నిరుపేదలకు మూడెకరాల సాగు భూమి హామీ నేటికీ అమలు కావడంలేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో మండల మహసభ నిర్వహించారు. పార్టీ మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సంక్షేమ పథకాలు అమలు కోసం సీపీఐ నిరంతర అండగా ఉంటుందన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడం కాదని, గిట్టుబాటు ధరను రైతులే ప్రకటించేలా హక్కులు కల్పించాలన్నారు. ఉద్యమాలు, ఎర్రజెండాలకు కేరాఫ్ హుస్నాబాద్ నియోజకవర్గమన్నారు.
ఉద్యమాల ఫలితమే గౌరవెల్లి, గండిపల్లి..
తాగు, సాగు నీరు కోసం ఎర్రజెండా నీడలో అనేక ఉద్యమాల ఫలితమే గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులని చాడ అన్నారు. కానీ నేటి పాలకులు గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయడకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కాలువల నిర్మాణానికి సుమారుగా రూ.431కోట్లు మంజూరైనట్లు చెప్పి ఏడాది గడుస్తున్నా పనులు మాత్రం చేపట్టకపోవడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. పాలకుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రాంతానికి సాగు నీరు రాలేదని మండిపడ్డారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో సీపీఐ సత్తాచాటాలని, ఆదిశగా ప్రతి కార్యకర్తలు సైనికులా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్, నాయకులు జాగిరి సత్యనారాయణ, ఎడల వనేష్, జనార్దన్, కోయ్యడ కోమురయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
పాలకుల నిర్లక్ష్యం వల్లే సాగు నీరు రాలే
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి
పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు చేయాల్సిందే
హుస్నాబాద్: చట్ట సభలకు ఎన్నికై పార్టీలను ఫిరాయిస్తున్న ప్రజాప్రతినిధులపై ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. హుస్నాబాద్ పట్టణంలోని సీపీఐ భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వాదులు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు. న్యాయ వ్యవస్థకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉండాలన్నారు. అధికారుల్లో అవినీతి పెరుకుపోయిందన్నారు. గౌరవెల్లి. గండిపెల్లి ప్రాజెక్టుల సామర్థ్యాన్ని అనవసరంగా పెంచారన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్, నాయకులు పాల్గొన్నారు.