
సరికొత్త సాగుపై దృష్టి సారించండి
నేత్రపర్వం.. తెప్పోత్సవం
మిన్నంటిన శ్రీరామ నామస్మరణతో గురువారం రాత్రి కోమటిచెరువులో తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. గంగమ్మ ఒడిలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అందంగా అలంకరించిన బోటులో హనుమంతుని ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించి చెరువు అంతా తిప్పారు. అంతకుముందు రావిచెట్టు హనుమాన్ దేవాలయం నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా కోమటిచెరువు వరకు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి చెరువులో తెప్పోత్సవం వైభోవంగా చేపట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు, పీఠాధిపతులు దుర్గాప్రసాద్ స్వామీజీ, మాలధారులు పెద్ద ఎత్తున పొల్గొని తరించారు. – సిద్దిపేటజోన్
● పంట మార్పిడితోనే అధిక లాభాలు ● నేపియర్ గడ్డి సాగుతో45 రోజుల్లోనే కోత ● ఎకరం పంటకు రూ.70వేల వరకు ఆదాయం : కలెక్టర్ మనుచౌదరి
అక్కన్నపేట(హుస్నాబాద్): వరి, పత్తి, మొక్కజొన్న పంటల సాగు కాకుండా సరికొత్తగా సాగు చేసేలా ప్రతి రైతు ఆలోచించాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. మండల పరిధిలోని కుందనవానిపల్లిలో గురువారం ప్రసిద్ధ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో కృషికల్ప సహకారంతో గండిపల్లి, కుందనవానిపల్లి గ్రామ రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా సుమారు 40 రైతు ఉత్పత్తిదారుల సంఘాలున్నాయన్నారు. అందులో అక్కన్నపేట మండలంలోని ప్రసిద్ధ, సహస్ర సంఘాల ద్వారా సరికొత్త పంట సాగు వైపు దృష్టిసారించామన్నారు. పంట మార్పిడితోనే అధిక లాభాలు వస్తాయన్నారు. కృషికల్ప సహకారంతో నేపియర్ గడ్డి సాగుకు రైతులందరూ ఆలోచించుకోవాలన్నారు. ఈ గడ్డి సాగు కేవలం 45రోజులోనే కోతకు వస్తుందన్నారు. నేపియర్ గడ్డి ఒక ఎకరంలో సాగు చేస్తే దాదాపు రూ.70వేల వరకు ఆదాయం వస్తుందన్నారు. ఈ గడ్డితో బయోగ్యాస్ తయారు చేస్తారన్నారు. గండిపల్లి, కుందనవానిపల్లి గ్రామాల్లో సుమారు 300ఎకరాల్లో ఈ గడ్డి సాగు చేసేలా రైతులు ముందుకు రావాలన్నారు. ఈ ప్రాంతంలోనే రూ.50కోట్ల వ్యయంతో బయోగ్యాస్ తయారీ కంపనీ ఏర్పాటు చేస్తారన్నారు. దీంతో ఈ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రాధిక, హార్టికల్చర్ అధికారి సువర్ణ, కృషికల్ప వ్యవస్థాపకులు పాటిల్, బయోగ్యాస్ కంపెనీ సీఈఓ గుప్తా, హుస్నాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి తస్లీమా సుల్తానా, ప్రసిద్ధ రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ ఏలేటి స్వామిరెడ్డి, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
నాణ్యమైన ఉచిత విద్య
సిద్దిపేటరూరల్: జిల్లాలోని గురుకుల పాఠశాలలో నాణ్యమైన ఉచిత విద్య అందుతోందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో 6 మైనారిటీ గురుకులాలకు సంబంధించి 5వ తరగతి ప్రవేశాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవలే కాస్మోటిక్ చార్జీలు పెంచిందని, 2025– 26 సంవత్సరానికి గాను 5వ తరగతిలో మైనార్టీ గురుకులాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రవేశం పొందాలన్నారు. ఈ అవకాశాన్ని మైనారిటీ విద్యార్థులు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రీజినల్ కో ఆర్డినేటర్ సుధారాణి, జిల్లాలోని మైనార్టీ పాఠశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

సరికొత్త సాగుపై దృష్టి సారించండి